తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. గడిచిన వారంరోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు లాంటి భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ కరోనా కట్టడి కావడం లేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి.
లాక్డౌన్ సడలింపుల అనంతరం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన మూడురోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికు తక్కువగా కాకుండా నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడమేగానీ తగ్గముఖం పట్టడంలేదు. గ్రీన్ జోన్లలో సైతం ప్రస్తుతం కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం. లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సైతం కరోనా బారినపడుతున్నారు. కీలకమైన శాఖల్లో ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి సైతం కరోనా వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రజలెవరు రావద్దని ప్రకటించడం సంచలనంగా మారింది.
బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!
ఉద్యోగులు సైతం కరోనా సమయంలో విధులు నిర్వహించాలంటే భయాందోళన చెందుతున్నారు. కరోనా ఎవరి నుంచి ఎలా వస్తుందో తెలియకపోవడంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వారిలో ఆందోళన నెలకొని ఉంటూనే ఉంది. కార్యాలయంలోని ఫైళ్లన్నీ ఒకరిని నుంచి మరొకరి వెళుతుంటాయి. ఈక్రమంలో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించింది. ఉద్యోగుల్లో కరోనా భయంపోయేలా.. పనులు వేగంగా జరిగేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ ఆఫీస్ విధానానికి నాంది పలికింది.
ఈ ఆఫీస్ విధానం ద్వారా ఉద్యోగులు ఇళ్లలో ఉన్నా.. కార్యాలయంలో ఉన్నా పనులు చేసే అవకాశం ఉంది. సచివాలయం సహా అన్ని హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టనుంది. ఈమేరకు ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్ రూపొందించాలని, ఆయా కార్యాలయాలకు అవసరమయ్యే కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ సంతకాలను సేకరించాలని ప్రభుత్వం నోట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆఫీస్ నిర్వహణకై ప్రతిశాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని నియమించారు.
వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?
ముందుగా రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనిలో ఎలాంటి గందరగోళం లేకుండా, ఫైళ్లను నిరంతరం ట్రాక్ చేసేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ-ఆఫీస్ పై ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది. జూలై రెండో వారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలు కానుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు కొంతమేర ఊరట లభించడం ఖాయంగా కన్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ విధానం వల్ల కరోనా వ్యాప్తిని కొంతమేర కట్టడి చేసే వీలుండటంతో ప్రభుత్వం కూడా ఈ ఆఫీస్ విధానానికే మొగ్గుచూపుతోంది.