Governor Tamilisai: ముఖ్యమంత్రి కేసీఆర్ తో సై అంటే సై అంటున్న తమిళ సై సౌందర్ రాజన్ కు స్థాన చలనం కలుగుతుందా? ఆమెతోపాటు మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లు మారే అవకాశం ఉందా? మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారతారా? అంటే దీనికి అవును అనే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మంత్రిమండలి విస్తృత సమావేశం నేపథ్యంలో ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో ఈ మేరకు ఊహాగానాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని.. పార్టీలోనూ సంస్థాగత మార్పులు చోటు చేసుకుంటాయని .. రాష్ట్రాల్లో అధ్యక్షులను మారుస్తారని వ్యాఖ్యలు వినిపించిన నేపథ్యంలో.. సోమవారం జరిగిన సమావేశం తుఫాను ముందర ప్రశాంతతను తలపించింది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన క్యాబినెట్ భేటీ సుదీర్ఘంగా 5 గంటల పాటు కొనసాగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పటికీ చాలామంది మంత్రులు తమ భవిష్యత్తు ఏమిటో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడినట్టు తెలుస్తోంది. మోడీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదని సమాచారం. బయటికి వచ్చిన తర్వాత విలేకరులు ప్రశ్నిస్తే ఎవరు కూడా మాట్లాడేందుకు ఇష్టం చూపలేదు. అయితే చాలామంది మంత్రులు తమ పదవులు పోతాయనే భావనతోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిలో చాలామందికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాజస్థాన్, చతిస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పలు సంస్థాగత మార్పులు ఉంటాయని… వాటిని ఒకటి రెండు రోజుల్లో అమలు చేస్తారని ప్రచారం జరుగుతున్నది. తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఖాయమని భావిస్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధాని కార్యాలయం తో పాటు పలు శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా పెద్ద ఎత్తున మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళ సౌందర్ రాజన్ కు స్థాన చలనం తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమెను తమిళనాడు రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం వినియోగించుకుంటారని ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ పదవి అనంతరం తమిళసై రాజకీయాలపై వెళ్తారా? లేక తనను మరో రాష్ట్రానికి అపాయింట్మెంట్ చేయాలని అడుగుతారా అనేది తేలాల్సి ఉంది.
ఇక మంత్రి మండలి విస్తృత భేటీలో ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల తో పాటు పలు ఇతర కీలక మంత్రిత్వ శాఖల పనితీరు కూడా మోడీ సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆయా శాఖలకు చెందిన అధికారులు తమ పనితీరును ప్రదర్శన రూపంలో మోడీకి సమర్పించారు. అమెరికా, ఈజిప్టు పర్యటన సందర్భంగా సాధించిన విజయాలను గురించి వివరించారు. సందర్భంగా పలు మంత్రులు తమ శాఖ పరిధిలో మోడీకి వివరించారు. దేశంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, లక్షల కోట్ల విలువైన బడ్జెట్, 2047 వరకు అమృతకాలంలో విధించిన లక్ష్యాలు మిగతా విషయాలపై ప్రధానమంత్రి కార్యాలయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.