GHMC: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.5258 కోట్ల రూపాయల నిధులు.. జీహెచ్ఎంసీకి బకాయిపడ్డ ప్రభుత్వం వాటిని చెల్లించకపోవడంతో నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆస్తుల నుంచి ఆయా శాఖలు సకాలంలో పన్నులు చెల్లించకపోవడంతో ఇప్పుడు జీహెచ్ఎంసీని నడపడం కానకష్టమవుతోంది. దీనివల్ల నగరపాలక సంస్థ ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో జాప్యం ఏర్పడుతోంది. ఇలానే కొనసాగితే జీహెచ్ఎంసీ నిధుల లేమితో ఉత్సవ విగ్రహంలా మారే అవకాశం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ సంస్థలు 87, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 30 శాఖలు ఉన్నాయి. ఇందులో పలు శాఖలు 25 ఏళ్లుగా పన్నులు చెల్లించడం లేదు. వాటికి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లింది. అయితే ఎలాంటి పురోగతి లేదు. సంబంధిత శాఖల అధికారులు పన్నుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగా ఏటేటా బకాయిలు పెరిగిపోతున్నాయి.
అత్యధికంగా వైద్యశాఖ 23 ఏళ్ల నుంచి నగర పాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. అన్ని శాఖల కంటే రూ.1185.18 కోట్ల బకాయితో మొదటి స్థానంలో నిలిచింది. రోడ్లు భవనాల శాఖ రూ.1170.05 కోట్లు, పోలీస్ శాఖ రూ.420 కోట్లు, విద్యాశాఖ రూ.385 కోట్లు చెల్లించాల్సి ఉంది.
తెలంగాణ సర్కార్ కు అబ్కారీశాఖ నుంచి ఏటా రూ.35 కోట్లకు పైగా ఆదాయం ఇస్తోంది. కానీ ఆ శాఖ 21 ఏళ్ల నుంచి నగర పాలక సంస్థకు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. రూ.894 కోట్లు బాకీ పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 30 శాఖల నుంచి నగర పాలక సంస్థకు రూ.306.28 కోట్ల బకాయి ఉంది.
ప్రస్తుతం జీహెచ్ఎంసీకి ఆస్తి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నది. పెండింగ్ లో ఆస్తి పన్నును చెల్లించేందుకు ప్రజలకు 5 శాతం మినహాయింపు ఇచ్చింది. రూ.600 కోట్ల వసూళ్లు చేయాలని టార్గెట్ గా పెట్టుకొని లక్ష్యాన్ని అధిగమించింది జీహెచ్ఎంసీ. రూ.750 కోట్లు వసూలైనట్టు అధికారులు ప్రకటించారు.
పన్ను చెల్లించకపోతే సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టే అధికారులు ఆయా శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఇళ్లకు తాళాలు వేసినట్టే ఆఫీసులకు సైతం లాక్ వేస్తేనే ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులు జరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందన్నది వేచిచూడాలి.