Eight years of Telangana: జూన్ 2 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆరు దశాబ్దాలపాటు ఎంతో మంది అమరవీరుల త్యాగాల కారణంగా.. ఎన్నో ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు జూన్ రెండో తేదీ. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్టాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాడిన తెలంగాణ ప్రజలు.. సొంత రాష్ట్ర కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. 1969 నుండే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం కాగా.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక దొరికినట్లయ్యింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే 2001లో కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టారు. అయితే 2011లో చేపట్టిన సకల జనుల సమ్మెతో హస్తిన పాలకుల్లో ఆలోచన మొదలైంది. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 2013 సంవత్సరంలో జులై నెలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ జనం పోరాడి మరీ సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి.
Also Read: CM Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీకి జగన్.. అసలు కథేంటి?
కరెంటు కోతల్లేకుండా..
2014 సంవత్సరం జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. కొత్త రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఎన్నో మార్పులొచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రానికి ఎంతో వెలుగొచ్చింది. తెలంగాణ వస్తే కరెంట్ లేక చీకట్లు తప్పవన్న నాటి పాలకుల హెచ్చరికలు తప్పని నిరూపిస్తూ.. కరెంటు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నారు. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా.. డిమాండ్ కు సరిపడా సరఫరా చేస్తున్నారు.
చెరువుల్లో నీటి కళకళ..
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. కరువుతో ప్రజలు అల్లాడిపోయేవారు. రాష్ట్రంలోని అనేక చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందుకే కేసీఆర్ సర్కారు మిషన్ కాకతీయ పేరిటన చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. వేలాది చెరువులకు పునరుజ్జీవం పోసింది. దీంతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ఇందులో లబ్ది రైతుల కేంటే టీఆర్‌ఎస్ నాయకులకు ఎక్కువ జరిగిందన్నా ఆరోపణలు ఉన్నాయి.
ఇంటింటికి నల్లా..
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కొళాయి(నల్లా) కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు సైతం అందిస్తున్నారు. గోదావరి పక్కనే పారుతున్నా.. ఇన్నాళ్లూ బోరు నీళ్లు మాత్రమే తాగిన పల్లెవాసులు ఇప్పుడు గోదారి నీళ్లను తాగుతున్నారు. అయితే నాలుగేళ్లయినా మారుమూల పల్లెలకు ఇప్పటికీ ఇంటింటికీ నల్లా కనెక్షన్ లేదు. ఉన్న గ్రామాలకు నీళ్లు రావడం లేదు.
సంక్షేమ పథకాలు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు బంధు, కళ్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఇప్పటికీ ఓ సంచలనం. మిగిలిన రాష్ట్రాలు సైతం వీటిని అమలు చేయడానికి ఆసక్తి చూపాయి. పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికి డబ్బులు ఇవ్వడం కోసం రూపొందించిన కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకం అందరి ప్రశంసలు అందుకుంది. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల చొప్పున నేరుగా రైతులకు సర్కారే పెట్టుబడి సాయం చేస్తోంది.
కేసీఆర్ కిట్..
ఒకప్పుడు సర్కారీ దవాఖానా అంటే భయపడే ప్రజలు.. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్పత్రుల వైపు ఆసక్తి చూపుతున్నారు. సర్కారీ దవఖానాల్లో మౌలిక వసతులు మెరుగుపడటం, నాణ్యమైన వైద్యం అందేలా చూస్తున్నారు. ఇక గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకుంటే.. కేసీఆర్ కిట్ పేరిట రూ.2,150తో పాటు ఓ కిట్ అందజేయనున్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలను అందజేస్తున్నారు.
ఐటీలోనూ మేటి తెలంగాణ..
తెలంగాణ అవతరించిన తర్వాత పేదలకు ఆసరా పింఛన్లు నిజంగానే ఆసరానిస్తున్నాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 వచ్చే పెన్షన్ రూ.2,016కు పెంచారు. కేవలం పెన్షన్ల కోసం తెలంగాణ సర్కారు 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతోంది. తెలంగాణ ఉద్యమాల సమయంలో ఐటీ కంపెనీలు కొత్త కార్యాలయాల ఏర్పాటుకు వెనుకడుగు వేశాయి. కానీ ఇదంతా తాత్కాలికమే అని నిరూపిస్తూ.. ప్రత్యేక రాష్ట్రం అవతరించాక హైదరాబాద్ ఐటీ శరవేగంగా పురోగమించింది. బెంగళూరుకు పోటీగా భాగ్యనగరం ఐటీ సంస్థలను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాదులో కార్యకలాపాలు వేగం పెంచాయి. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో దాదాపు 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
అభివృద్ధి వెంటే.. అప్పులు..
తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా అప్పుల కూపంలోకి కూరుకుపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ సంక్షే మపథకాల పేరిట ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతుండడంతో రాష్ట్ర ఆర్థి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎనిమిదేళ్లలో తెలంగాణ బంగారు మయం అయిందో లేదో తెలియదు కాని ప్రతీ తెలంగాణ ఒక్కరిపై తెలియకుండానే రూ.2 లక్షల అప్పులు మాత్రం ఉంది. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరీ దిగజారుతోంది. అప్పులు చేయనిదే నెల గడిచే పరిస్థితి ఉండడం లేదు.
ప్రభుత్వ రంగసంస్థలకు పెరుగుతున్న బకాయిలు..
తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగ సస్థల నుంచి కూడా భారీగా అప్పులు తీసుకుంటోంది. సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిపోయి.. సంస్థల నుంచే డబ్బులు తీసుకోవడం గమనార్హం. సింగరేణి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.13 వేల కోట్లు బయాయి పడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థ బకాయిలు కూడా రూ.8 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలసింది. ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడి నుంచి అప్పులు తీసుకుంటున్న ప్రభుత్వం వాటిని ఉత్పాదకరంగంలో పెట్టుబడి పెట్టడం లేదు.
నెలనెలా వేతనాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి..
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఉద్యోగ భద్రత, నెలనెలా సమయానికి వేతనాలు ఇవ్వడం, ఏడాదికోసారి ఇంట్రిమెంటు, డీఏ, ఇతర సదుపాయాలు ఉంటాయి అన్న భావన ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగులకు నెలలో ఎప్పుడు వేతనం వస్తుందో తెలియని పరిస్థితి. నెలనెలా వచ్చే వేతనంపై ఉద్యోగులు ఈఎంఐలు, బ్యాంకు రుణాల వడ్డీలు, గృహ రుణాల ఇన్‌స్టాల్‌మెంట్.. ఇతరత్రా వాటికి సబంధం ఉంటుంది. కానీ ఐదారు నెలలుగా పరిస్థితి మారింది. నెలలో ఎప్పుడు వేతనం వస్తుందో తెలియని పరిస్థితి. ఆసరా పథకం పేరిట వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత వృత్తులు వారికి ప్రభుత్వం పింఛన్లు ఇస్తోంది. వీటి కోసం కూడా లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. పింఛన్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి వాటిపై ఆధారపడిన అనేక మంది బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిప్థితి.
ఎందుకీ దుస్థితి..
మిగుల బడ్జెట్‌తో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రస్తుతం రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాడేనాటికి కేవలం రూ.60 వేల కోట్ల అప్పులు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక.. కరెంటు సమస్య, నీటి సమస్య మినహా ఏదీ పరిష్కరం కాలేదు. నియామకాలు జరుగలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని రోజులుగా ముప్పేటా విమర్శల దాడి పెరగడంతో ఇటీవలే నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. నియామకాలు మాత్రం ఎప్పుడు జరుగాయో ఎవరికీ తెలియదు. కానీ అప్పులు మాత్రం భారీగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయ ప్రయోజనాలకే పాలకులు ప్రాధాన్యత ఇవ్వడం. ఎన్నికల్లో గెలవడం కోసం సంక్షేమ పథకాలు అంటూ తెలంగాణలో డబ్బుల పంపిణీ పెరిగింది. ఉత్పాదకత రంగంలో పెట్టుబడి కోసం చేయాల్సి అప్పులను ప్రజలకు పంపిణీ చేయడంతో క్రమంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కరిగిపోతూ వస్తోంది. తెచ్చిన అప్పులకు నెలనెలా వందల కోట్లు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దీంతో తాజాగా పన్నుల పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.
Also Read:ACB App in AP: ఏపీలో లంచాలకు చెక్.. జగన్ సంచలన నిర్ణయం..