
తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ ఓటమి పాలైంది. ఊహించని విధంగా తన సిట్టింగ్ స్థానాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని ఇన్ని రోజులు చెప్పుకున్న బీజేపీకి అనూహ్యంగా దెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు ఈ ఫలితాలపై బీజేపీ లీడర్లు పోస్టుమార్టం చేశారట. అంతేకాదు.. బీజేపీ ఓటమిలో పవన్ ప్రభావం ఎంత అనే లెక్కలు వేస్తున్నారంట.
2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ తెలంగాణలో పెద్దగా లెక్కలో కూడా రాలేదు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు సాధించి ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది. అయితే.. అక్కడితో ఆగకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం రాజకీయ సమీకరణాలను మార్చివేసింది. దానికి కొనసాగింపుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ఒంటరిగా మెజారిటీ రాకుండా చేయడంలోనూ సఫలమైంది. దీంతో తెలంగాణలో బీజేపీ ఇమేజీ ఒక్కసారిగా పెరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని భూ స్థాపిస్తం చేస్తామంటూ తెలంగాణ బీజేపీ నేతలు బలమైన వ్యాఖ్యలే చేశారు.
Also Read: తెలంగాణ బీజేపీకి షాక్.. మళ్లీ మొదటికి వ్యవహారం
ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ ఇమేజీని కొనసాగించేందుకు నానా యాతన పడ్డారు. ఆ పేరును సరిగ్గా హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు. దుబ్బాక ఎన్నికల సమయంలో బండి సంజయ్ అధికార పార్టీపై చేసిన పరుష మాటలకు జై కొట్టిన జనాలే తాజాగా బండి సంజయ్ చేస్తున్నవి అర్థం పర్థం లేని వ్యాఖ్యలని తప్పుపడుతున్నారు. ఇక హైదరాబాద్ ప్రాంతంలో పోటీ చేసిన బీజేపీ నేత రామచంద్రరావు కూడా కాస్త అహంభావంతోనే మాట్లాడారు. ఐదేళ్ల కిందట తెలంగాణలో బీజేపీ హవా పెద్దగా లేని రోజుల్లోనే తాను గెలిచానని, ఇప్పుడు బీజేపీ హవా కూడా పెరగడంతో తన గెలుపు సునాయాసం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఖమ్మం ప్రాంత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వీరిద్దరి కంటే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి వెనకబడడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. దుబ్బాక ఎన్నికల సమయానికి తెలంగాణ బీజేపీకి మీడియాలో ఇప్పుడున్నంత కవరేజ్ ఉండేది కాదు. పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడి బీజేపీ దుబ్బాక రాజకీయం నెరిపింది.
Also Read: కేసీఆర్ ను వణికించేలా తీన్మార్ మల్లన్న ఏంచేశాడు?
ఇప్పుడు మరో విషయం తెరమీదకు వచ్చింది. అదే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో గొడవ పడడం. ఆ గొడవ రాష్ట్రంలో బీజేపీకి మైనస్ తెచ్చిందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. దుబ్బాక ఎన్నికల సమయంలో జనసేన అభిమానులు కూడా సోషల్ మీడియాలో రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం చేశారు. మొత్తంమీద దుబ్బాకలో వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ గెలుపొందింది. అయితే.. ఇంతలో వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్‌కు బీజేపీకి మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది. జీహెచ్‌ఎంసీలో బీజేపీ, మునుపటితో పోలిస్తే బాగానే పెర్ఫామ్ చేసినప్పటికీ, సెటిలర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీఆర్ఎస్ పైచేయి సాధించింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అయితే.. తెలంగాణ బీజేపీకి, జనసేనకు గ్యాప్ పెరగడంతో సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీకి షాక్ ఇస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు ప్రకటించారు. ఖమ్మం సిట్టింగ్ స్థానం కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ మొదటి నుండి అనుకూలత ఉండేది. కానీ. హైదరాబాద్ బీజేపీ నేత రామచంద్ర రావు సిట్టింగ్ స్థానం కావడంతో నిజానికి వాణీదేవి విజయావకాశాలపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. కానీ.. కారణాలు ఏవైనా వాణీదేవి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఓడించి సీటు కైవసం చేసుకున్నారు. ఒకవేళ జనసేన మద్దతు కనుక బీజేపీకి అలానే కొనసాగితే ఫలితంలో ఈ మార్పు ఉండకపోవచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది.