Telangana Elections 2023: నోట్ల కట్టలు బయటికి వస్తున్నాయి. లక్షలు కాదు కోట్లను దాటేస్తున్నాయి. ట్రంకు పెట్టెలు దాటి దర్జాగా పంపిణీ అవుతున్నాయి. పోల్ చీటీలు చూపించడమే ఆలస్యం ఓటర్ల చేతిలో కరెన్సీ నోట్లు పడుతున్నాయి. అధికారం, ప్రతిపక్షమనే తేడా లేకుండా ఓటర్ల జేబులో దండిగా పెడుతున్నాయి.. ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే నేతలు ఇలా నోట్ల పంపిణీ చేయడం, అది కూడా దర్జాగా డిస్ట్రిబ్యూట్ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.. పోలీసులు, ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్నప్పటికీ నేతలు దర్జాగా నోట్లు పంపిణీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
త్రిముఖ పోటీ ఉండడంతో..
వాస్తవానికి హైదరాబాద్ నగరవాసులు ఓటు వేయడానికి ఆసక్తి చూపరనే అపవాదు ఉంది. ఇందులో ఎన్నికల సంఘం తప్పు కూడా ఉంది. పోల్ చీటీలు పంపిణీ చేయకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి పరిణామాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అయితే ఈసారి పోటీ అధికంగా ఉండడంతో రాజకీయ పార్టీలే నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి పోల్ చీటీలు పంపిణీ చేశాయి. అంతేకాదు నేరుగా చేతిలో డబ్బులు పెట్టాయి.. అధికార భారత రాష్ట్ర సమితి మూడువేల నుంచి 5000 వరకు ఒక్కో ఓటుకు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ మూడు వేల దాకా సమర్పించుకుంది. భారతీయ జనతా పార్టీ మూడు వేల నుంచి 4 వేల వరకు ఇచ్చింది.. ఇక అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లకైతే లక్షల్లో ప్యాకేజీలు అందాయి. గేటెడ్ కమ్యూనిటీలో అయితే నజరానాలకు అంతు పొంతు లేదు. వాస్తవానికి గతంలో హైదరాబాద్ మహానగరం, దాని చుట్టూ ఉండే నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. హైదరాబాదులో ఉండే వారంతా విద్యావంతులు కావడంతో డబ్బులు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థులు నేరుగా వారి ఇంటికి వెళ్లడం.. పోల్ చీటీలతోపాటు డబ్బులు ఇవ్వడంతో వారు కూడా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్, దాని చుట్టూ ఉండే నియోజకవర్గాలు పూర్తిగా నగర ప్రాంతాలు కాబట్టి అడ్రస్ దొరకడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలవాలి అంటే అందరి ఓట్లు ముఖ్యం కాబట్టి రాజకీయ పార్టీలు ఓటర్ల చిరునామాలు వెతుక్కుని మరి పోల్ చీటీలు అందజేసి నగదు పంపిణీ చేస్తున్నాయి.
60 నుంచి 70 కోట్లు
హైదరాబాద్ అంటే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి.. ఎన్నికల్లో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే ప్రచార ఖర్చు అధికారులకు తడిసి మోపెడవుతుంది.. దీనికి తోడు వెంట వచ్చేవారికి భోజనాల ఖర్చు, రోజు బెటా.. సాయంత్రం మద్యం.. వంటివి సమకూర్చడం అభ్యర్థులకు కత్తి మీద సామవుతోంది. అధికార పార్టీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇక మిగతా పార్టీల అభ్యర్థులకు మాత్రం ఎన్నికల ఖర్చు చుక్కలు చూపిస్తోంది. కొంతమంది అభ్యర్థులయితే తమకున్న విలువైన ఆస్తులను అమ్ముకుంటున్నారు. అలా వచ్చిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు.. అయితే ఆ డబ్బు పంపిణీ చేసే క్రమంలో పోలీసులకు చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. నగదు పంపిణీ పూర్తయినప్పటికీ గెలుపు మీద ఏమైనా సందేహాలు ఉంటే మలి విడతగా కూడా పంపిణీ చేస్తున్నారు. ఉదాహరణకు ఉప్పల్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు 3000 చొప్పున పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసిన మరో పార్టీ అభ్యర్థి ఓటుకు 2500 చొప్పున పంపిణీ చేశారు. అయితే ప్రధాన పార్టీ అభ్యర్థి తన విజయం పై కొంత అనుమానం ఉండటంతో మలివిడతగా కూడా పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఖైరతాబాద్ లో ఓ అభ్యర్థి కేవలం ఓటర్లకు పంపిణీ చేయడానికి 40 కోట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మహానగరానికి అనుకొని ఉన్న మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఖైరతాబాద్, శేరి లింగంపల్లి, కూకట్ పల్లి నియోజకవర్గం లో భారీ ఎత్తున నగదు చేతులు మారింది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలో ఓ పార్టీ అభ్యర్థి కేవలం మద్యం కోసమే 10 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇక్కడ ఓటుకు 5000 చొప్పున ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నేతలకు ఎక్కువగా హవాలా మార్గంలో డబ్బు సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల వల్ల ఓటర్లకు, కార్యకర్తల పంట పండుతోంది.