Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ మూడో లిస్ట్ ప్రకటించగా, మంగళవారం బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. బీజేపీ మూడు జాబితాల్లో 88 మందికి టికెట్లు ఇచ్చింది. తాజాగా నాలుగో జాబితాలో 12 మందికి టికెట్లు ఇచ్చారు. దీంతో మొత్తం వంద మందికి టిక్కెట్లు ఇచ్చినట్లయింది.
వేములవాడలో ఈటలదే పైచేయి..
ఇక వేములవాడ టికెట్‌పై బీజేపీలో పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి ఈటలతో బీజేపీలో చేరిన తుల ఉమ టికెట్ ఆశించగా, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు టికెట్ ఆశించారు. ఈయన బండి సంజయ్ చొరవతో ఇటీవలే బీజేపీలో చేరారు. ఇప్పటికే నియజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. దీంతో టికెట్ విషయంలో అభ్యర్థుల కంటే.. ఈటల, బండి మధ్య పోటీ అన్నట్లుగానే ప్రచారం సాగింది. చివరకు ఈటల పైచేయి సాధించారు. తన వెంట బీజేపీలో చేరిన తుల ఉమకు టికెట్ ఇప్పించారు. దీంతో వికాస్‌రావు ఆశలు ఆవిరయ్యాయి. దీంతో అసంతృప్తి చలరేగే అవకాశం కనిపిస్తోంది.
నాలుగో జాబితాలో 12 మంది వీరే..
బీజేపీ ప్రకటించిన ఆనలుగో జాబితాలో హుస్నాబాద్ నుంచి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వేములవాడ నుంచి తుల ఉమ, సిద్దిపేట నుంచి శ్రీకాంత్‌రెడ్డి, మునుగోడు నుంచి చలమల కృష్టారెడ్డికి టికెట్ ఇచ్చారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్ పోటీ చేయాల్సిన చెన్నూర్ టికెట్‌ను దుర్గం అశోక్‌కు ఇచ్చారు. ఏనుగు రవీందర్‌రెడ్డి పోటీ చేయాల్సి ఎల్లారెడ్డి టికెట్ ఆయన కాంగ్రెస్‌లో చేరడంతో సుభాష్‌రెడ్డికి ఇచ్చారు. వికారాబాద్ నవీన్‌కుమార్, టీపీసీసీ చీఫ్ సొంత నియోజవర్గం కొడంగల్ బరిలో రమేశ్‌కుమార్ దిగనున్నారు. డీకే.అరుణ సొంత నియోజకవర్గం టికెట్‌ను బీసీకి కేటాయించారు. అరుణ పోటీకి నిరాకరించడంతో ఆమె సూచించిన బోయ శివకు టికెట్ ఇచ్చారు. మిర్యాలగూడ సాధినేని శ్రీనివాస్, నకిరేకల్ మొగులయ్య, ములుగు అజ్మీరా ప్రహ్లాద్‌కు కేటాయించారు.
బీసీ, మహిళలకు ప్రాధాన్యం..
ఇప్పటి వరకు వంద స్థానాలను బీజేపీ ప్రకటించింది. ఇందులో బీసీలు, మహిళలకే అధిక స్థానాలును కేటాయించింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీసీలు, మహిళలకే బీజేపీలోనే ఎక్కువ టిక్కెట్లు దక్కాయి. బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న బీజేపీ అందుకు అనుగుణంగానే టిక్కెట్లు కూడా కేటాయించింది.