Telangana Elections 2023: ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. సరైన సమయంలో పనులు చేయకపోతే, అవకాశాలు మళ్లీ ఎప్పటికీ తిరిగిరావు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండగా, మూడు పార్టీలు పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాపై అసంతృప్త జ్వాగలు భగ్గుమన్నాయి. ఇప్పటికే ప్రకటించిన వనపర్తి, చేవెళ్ల, బోథ్ అభ్యర్థులకు బీఫాం ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాలో బోథ్, వనపర్తి అభ్యర్థులను మార్చింది. దీంతో సీనియర్లు నష్టపోయారు. మరోమైపు మూడో జాబితాల్లో టికెట్ ఆశించిన వారి పేర్లు రాకపోవడంతో నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పఠాన్‌చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పార్టీ వీడే యోచనలో దామోదర..
ఇదిలా ఉండగా, పటాన్‌చెరు, నారాయణఖేడ్ టికెట్ల తన వర్గానికి ఇప్పంచుకునేందుకు కాంగ్రెస సీనియర్ నేత, ఆందోల్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, రేవంత్, భట్టి, జగ్గారెడ్డి చక్రం తిప్పడంతో రాజనర్సింహ అనుచరులకు టికెట్లు రాలేదు. దీంతో ఆయన కూడా పార్టీ వీడేందకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు.
కాంగ్రెస్‌లో గట్టి పోటీ
పఠాన్‌చెరులో బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని చాలా రోజుల క్రితమే అభ్యర్థిగా ప్రకటించగా ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. బీజేపీ అభ్యర్థిగా నందీశ్వర్‌గౌడ్ పేరును ఆ పార్టీ నాయకత్వం మొదటి లిస్టులోనే ప్రకటించింది. కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు తర్వాత ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముధిరాజ్‌కు టికెట్ ప్రకటించింది. ఇక్కడి నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్ టికెట్ ఆశించారు. 20 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో మహిపాల్‌రెడ్డిపై పోటీ చేశారు. 83 వేల ఓట్లు సాధించారు. ఈసారి ఎలాగైనా మహిపాల్‌రెడ్డిని ఓడిస్తానన్న ధీమాతో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం అనూహ్యంగా కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను పక్కన పెట్టి.. పది రోజుల క్రితం పార్టీలో చేరిన నీల మధుకు టికెట్ ఇచ్చారు.
మధు చేరికతో మారిన పరిణామాలు..
20 రోజుల వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా కాటా శ్రీనివాస్‌గౌడ్ బరిలో ఉంటారని అందరూ అనుకున్నా.. బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసిన నీలం మధు కాంగ్రెస్ లో చేరటంతో ఒక్కసారిగా పరిణామాలు మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నీలం మధుకి టికెట్ ఇవ్వాలని మొగ్గుచూపడం దానికి కాటా శ్రీనివాస్‌గౌడ్ ఒప్పుకోకపోవడంతో పార్టీ నాయకత్వం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఈ పరిణామాల మధ్యలో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం, ఒక నిర్లిప్తతలోకి వెళ్ళింది. ఇద్దరూ టికెట్ కోసం పోటీ పడుతుండటంతో వీరి ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు విఫలమయ్యారు. చివరకు కాటాకు మొండిచేయి చూపించారు.
నారాయణఖేడ్ నియోజకవర్గం
ఇదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని ప్రకటించగా, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ జర్నలిస్ట్ జనవాడే సంగప్పని బరిలోకి దించింది. వారిద్దరూ ఇక్కడ ప్రచారం చేసుకుంటుండగా, కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కార్‌కు టికెట్ ఇచ్చింది. పట్లోళ్ల సంజీవరెడ్డి టికెట్ ఆశించారు. అయితే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో అభ్యర్థి ప్రకటనలో జాప్యం చేసింది. చివరకు సురేశ్ షెట్కార్‌కే టికెట్ ఇచ్చింది.
పటాన్‌చెరు టికెట్ అమ్ముకున్నారని ఆరోపణ..
‘20 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చెసింది, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. నీలం మధు దగ్గర ఎమ్మేల్యే జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి ముట్టినయి అన్నీ రేపు ఆధారాలతో బైటపెడతాం. టికెట్ ఇస్తాం అని ఢిల్లీ పిలిచి నమ్మించి మోసం చేశారు. మా ఆస్తులు పోయినా కాంగ్రెస్ జెండా వోదలకుండా పని చేశాం, చివరగా మాకు కాంగ్రెస్ ఇచ్చిన బహుమానం ఇది’ అని కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధ ఆరోపించారు.
అసమ్మతి జ్వాలలు..
కాంగ్రెస్ అసమ్మతివాదులు అనుచరగణంతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కొందరు రాజీనామా చేస్తుంటే.. మరికొందరు టికెట్ ఇవ్వకుంటే రెబల్‌గా పోటీ చేసి తీరతామని అంటున్నారు. ఈ తరుణంలో పార్టీకి నష్టం జరగకుండా అసమ్మతి సెగను చల్లార్చేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా సీనియర్లు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా అసమ్మతి వాదులను బుజ్జగించే కార్యక్రమం కొనసాగుతోంది.
సమ ఉజ్జీలతో సమస్య..
అసంతృప్తికి ప్రధాన కారణం సమఉజ్జీలు ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటం. సుదీర్ఘకాలం పార్టీ కోసం పని చేసిన.. తమకు కాకుండా బయట వాళ్లకు సీట్లు ఇవ్వడంపై పార్టీలో చర్చకు దారి తీసింది. టికెట్ రాని నాయకులు పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుంటే.. ఆ ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపై తీవ్రంగా పడుతుందన్న ఆందోళన పార్టీలో ఉంది. ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన జానారెడ్డి సమన్వయ కమిటీతో పాటు ఐదుగురు ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు కూడా ఓదార్చే పనిలో నిమగ్నమయ్యారు.
అసంతృప్త నేతల అసమ్మతి గళం..
టికెట్ల కేటాయింపు మార్చాలంటూ నిరసనటికెట్ల కోసం ప్రయత్నించి దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులను పిలిచి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా అసంతృప్తులతో చర్చిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి రాంరెడ్డి , హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పరకాలను ఇనుగుల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట నుంచి నమిల్ల శ్రీనివాస్, మిర్యాలగూడ నుంచి శంకర్‌నాయక్, మక్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డిలతో సీనియర్లు సమావేశమై బుజ్జగిస్తున్నారు. తాజాగా కాటా శ్రీనివాస్‌గౌడ్, చిన్నారెడ్డి, వెన్నెల అశోక్ కూడా ఈజాబితాలో చేరారు. పార్టీ కోసం పని చేసిన నాయకుల విధేయతను దృష్టిలో ఉంచుకుని బుజ్జగించడంతో పాటు నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించనున్నట్లు హామీ ఇస్తున్నారు.