Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికల నగారా మోగనుంది. మరో వారంలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనెల 10న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలోనే తెలంగాణ ఎన్నికలు పూర్తిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2018లో సైతం ఇదే తరహాలో షెడ్యూల్ విడుదల అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అటు తెలంగాణ ప్రభుత్వ చర్యలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 10లోపు సంక్షేమ పథకాల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలక పథకాలకు, ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఈనెల 10లోగా శ్రీకారం చుట్టూ ఉన్నట్లు తెలుస్తోంది. విజయదశమి నాడు పాఠశాలల్లో ప్రారంభించాలనుకున్న సీఎం అల్పాహార పథకాన్ని.. ఈనెల 6న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సోమవారం ఉద్యోగులకు ఏకంగా పి.ఆర్.సి ప్రకటించారు. ఏకంగా ఐదు శాతం ఐ ఆర్ కూడా మంజూరు చేశారు. మరి కొన్ని కీలక నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎలక్షన్ కమిషన్ సైతం తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ హైదరాబాదులో పర్యటించారు. 17 మంది అధికారులతో కూడిన బృందం ఏర్పాట్లను సమీక్షించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల యంత్రాంగాలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. అటు ప్రభుత్వం సైతం ఈ వారం రోజులపాటు సంక్షేమ పథకాలతో పాటు కీలక నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల ప్రభుత్వాల గడువు జనవరి 24 తో ముగియనుంది. మిజోరం ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఈ యాడాది డిసెంబర్ 17 వరకే గడువు ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడం విశేషం. మరోవైపు ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ వేగంగా పర్యటనలు సాగిస్తున్నారు. తెలంగాణలో సైతం మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు సభలు పెట్టారు. బిజెపి అగ్ర నేతలంతా తెలంగాణకు క్యూ కడుతున్నారు. మొత్తానికైతే తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా తో ఏపీలో సైతం రాజకీయ వేడి ప్రారంభమైంది.