Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేటలో బోణీ కొట్టిన కాంగ్రెస్ కూడా తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందును కూడా తన ఖాతాలోనే వేసుకుంది. దీంతో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్‌ఎస్ నుంచి ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గడప తొక్కకుండా చేస్తామన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శపథం నిజమయ్యే అవకాశాలే కనిపిస్థున్నాయి. ప్రస్తుతం ఖమ్మం ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్ అనూహ్యంగా దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ రామగుండం సీటును కూడా తన అకౌంట్‌లో వేసుకుంది. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి చందర్‌పై రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు.
రెండూ సింగరేణి ప్రభావిత నియోజకవర్గాలే..
ఇక ఇల్లెందు, రామగుండం రెండూ పారిశ్రామిక ప్రాంత నియోజకవర్గాలే. ఇక్కడ అర్బన్ ఓటర్లు ఎక్కువ. సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతం. డిసెంబర్ 24న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సీట్లు కూడా కాం‘గ్రెస్ ఖాతాలోకి రావడం ఆసక్తిగా మారింది.
భూపాలపల్లి, మంథనిలో ఆధిక్యం..
ఇక సింగరేణి ప్రభావిత గ్రామాలైన భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ స్పష్తమైన ఆధిక్యం కనబరుస్తోంది.గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్‌బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బెల్లంపల్లి, చెన్నూర్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు వినోద్, వివేక్ విజయం వైపు దూసుకుపోతున్నారు. దీంతో గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ కూడా విజయం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగరేణి కార్మిక కుటుంబాలు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.