DGP Anjani Kumar: కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గ్యాప్ వచ్చిన తర్వాత రెండేళ్లుగా సాఫీగా సాగిన తెలంగాణ పాలనలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఒకపైపు ఐటీ, ఈడీ దాడులు, మరోవైపు లిక్క స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్‌ల వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన సుమారు 27 మంది క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగేలా ఆర్డర్ తెచ్చుకున్నారు. కాకతాళీయమే కావొచ్చు కానీ, ఆ 27 మందిపై కోర్టు తుది తీర్పు వెలువడబోతోంది. ఇప్పటికే సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. తాజాగా మరో 27 మంది భవితవ్వ్యం శుక్రవారం తేలిపోనుంది. ఇందులో డీజీపీ అంజనీకుమార్ కూడా ఉండడం గమనార్హం.

వెళ్లక తప్పదా..
తెలంగాణ సీఎస్‌గా పని చేసిన సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోయారు. హైకోర్టు తీర్పుతో ఆయన ఏపీలో రిపోర్టు చేయక తప్పలేదు. ఇప్పుడు అదే తరహాలో కొంత మంది సీనియర్ ఐఏఎస్..ఐపీఎస్ అధికారులకు తప్పేలా లేదు. దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెబుతుందనే ఉత్కంఠ అధికారవర్గాల్లో కనిపిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న 12 మంది అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
సోమేశ్ బాటలోనా…
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ తరహాలోనే డీజీపీ అంజనీకుమార్, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులను ఏపీ – తెలంగాణకు కేటాయించారు. అందులో 11 మంది అధికారులు తమ కేటాయింపులను సవాల్ చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన క్యాట్ మార్గదర్శకాలు సిరగా లేవంటూ వాటిని రద్దు చేస్తూ 2016లో తీర్పు ఇచ్చింది. దీనిని కేంద్రంతో పాటుగా పలువురు అధికారులు 2017లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఇద్దరు అధికారులు తమ పిటీషన్‌లను ఉప సంహరించుకున్నారు. గత వారం సోమేశ్‌కుమార్ కేటాయింపుపైన విచారించిన హైకోర్టు ఆయన్ను ఏపీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. మిగతావారు కూడా సోమేశ్‌కుమార్ బాట పట్టక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమేశ్‌కు ఇచ్చిన తీర్పే వర్తిస్తుందని హైకోర్టు ప్రకటిస్తే వీరంతా తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.

డీజీపీ వెళితే రికార్డే..
హైకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ కూడా ఏపీకి వెళ్లాల్సి వస్తే తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించినట్లే. ఒకే నెలలో అత్యున్నత అధికారులు అయిన సీఎస్, డీజీపీ వెళ్లిపోవడం గతంలో ఎన్నడూ జరుగలేదు. డీజీపీగా అంజనీకుమార్‌ను సీఎం కేసీఆర్ పది రోజుల క్రితమే నియమించారు. మహేందర్‌రెడ్డి రాజీనామాతో ఈ నియామకం జరిగింది. ఇప్పుడు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు విచారణ కేసులో అంజనీకుమార్‌తోపాటు రోనాల్డ్ రోస్, జి.అనంతరాములు, ఆమ్రపాలి తదితరులు ఉన్నారు. దీంతో..ఇప్పుడు హైకోర్టు నిర్ణయంపై అధికార వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సోమేశ్ కుమార్ ఏపీలో రిపోర్టు చేసినా..ఇప్పటి వరకు ఆయనకు అక్కడ పోస్టింగ్ ఖారారు కాలేదు. ఇక, ఇప్పుడు ఈ అధికారుల విషయంలో హైకోర్టు తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానుంది. ముఖ్యమైన పోస్టులో ఉన్న అధికారులు ఈ జాబితాలో ఉండటంతో.. హైకోర్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.
27కు తీర్పు వాయిదా..
హైకోర్టు తీర్పుపై అధికారుల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా హైకోర్టు తీర్పు ప్రకటనను ఈనెల 27కు వాయిదా వేసింది. దీంతో ఈ ఉత్కంఠ మరో వారం పాటు కొనసాగనుంది. పిటిషనర్లు వ్యక్తిగత వాదనలు వినిపించేందుకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. క్యాట్ ఆర్డర్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఇచ్చినందున వ్యక్తిగత వాదనలు వినాలని అధికారులు విన్నవించారు. దీంతో విచారణ వాయిదా వేసినట్లు తెలిసింది.