Nitish Kumar- KCR: ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఇక తమది జాతీయ పార్టీ అని ప్రకటించారు. ప్రకటించగానే జాతీయ పార్టీ అయిపోదు. కానీ ఆస్థాయిలో ఊపు తెచ్చేందుకు కేసీఆర్ ఖమ్మంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభకు చాలామంది నేతలను ఆహ్వానించారు. కానీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీపీఐ నేతలు మినహా ఎవరూ హాజరు కాలేదు. కొందరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. కేసీఆర్‌కు అన్నింటా మద్దతు ప్రకటించిన ఆ నేతలు ఈ సభకు రాలేదు. వారిని ఆహ్వానించ లేదా. ప్రత్యేక కారణాలతో వారే దూరంగా ఉన్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకీయ పోరాటం ప్రారంభించటంతో.. సభపైన జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. అయితే సభలో హాజరైన వారి కంటే రాని వారి గురించే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీఆర్‌ఎస్ సభకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

సభపై సమాచారం లేదన్న నితీశ్..
ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభను గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటుగా సీపీఐ నేత రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ హాజరయ్యారు. మిగిలిన నేతలు పాల్గొన లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ – బీజేపీయేతర పార్టీల నేతలతో కొద్ది నెలలుగా కేసీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, బీఆర్‌ఎస్ ప్రతిష్ఠాత్మకంగా భావించిన సభకు మాత్రం కీలక నేతలు కొందరు దూరంగా ఉన్నారు. దీని పైన స్పందించిన నితీశ్..‘కేసీఆర్ ఆ సభ నిర్వహిస్తున్న సంగతి నాకు తెలియదు. నేను ఇతర పనుల్లో బిజీగా ఉన్నాను. కేసీఆర్ పార్టీ సభకు ఆహ్వానం అందుకున్న వారంతా అక్కడికి వెళ్లారు’ అని చెప్పుకొచ్చారు. అయితే, నితీశ్‌ను బీఆర్‌ఎస్ ఆహ్వానించకపోవటం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. అదే విధంగా జాతీయ స్థాయిలో బీజేపీపైన వ్యతిరేక గళం వినిపిస్తున్న ప్రధాన నేతలు ఖమ్మం సభకు హాజరు కాలేదు. ఆ నేతలు దూరం కావటం వెనుక.. కేసీఆర్ గతంలో స్వయంగా కలిసిన పశ్చిమబెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్‌సోరేన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీఎస్ నేత కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తదితరులెవరూ బీఆర్‌ఎస్ తొలి సభకు వెళ్లకపోవడం గమనార్హం. ముఖ్యంగా ప్రతిపక్షాల ఐక్యత అవసరమని చెబుతున్న నితీశ్, తేజస్వి వెళ్లకపోవడం పైన చర్చ మొదలైంది. అయితే, కేసీఆర్ పిలిచిన వారే ఖమ్మం వెళ్లారంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
తన కోరికను బయటపెట్టిన నితీశ్..
బీఆర్‌ఎస్ సభకు దూరంగా ఉన్ననితీశ్ కుమార్ అదే సమయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై నడిస్తే చూడాలని ఉందని నితీశ్ వ్యాఖ్యానించారు. అంతకుమించి తనకు ఇంకేమీ అవసరం లేదని.. అదే తన ఏకైక స్వప్నమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని గుర్తు చేశారు. విపక్షనేతలంతా కలిసి ముందుకు సాగితే దేశానికే ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఇప్పుడు నితీశ్ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో విపక్ష పార్టీల ఐక్యత పైన కొత్త చర్చ మొదలైంది.

బీఆర్‌ఎస్‌తో సాగేదెవరు?
ఇదిలా ఉంటే.. ఖమ్మం సభకు వచ్చిన నేతలు బీఆర్‌ఎస్‌తో కొనసాగుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించిన కేసీఆర్.. కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని విపక్ష పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మద్దతు కూడగట్టారు. కానీ, ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం.. ఇప్పుడు ఖమ్మం సభలోనూ కొందరు ముఖ్య నేతల గైర్హాజరు వెనుక కారణలపైన కొత్త చర్చ మొదలైంది. తమను ఖమ్మం సభకు ఆహ్వానించలేదని జేడీయూ, ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కొన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలవటానికి కేసీఆర్ సిద్దంగా లేరు. ఇప్పుడు నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ పార్టీల వేదికగా బీఆర్‌ఎస్ చెబుతున్న వేళ కొన్ని పార్టీలు దూరంగా ఉంటున్నాయని విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక, ఎన్నికలు ఏవైనా ఒంటిరాగా పోటీచేసే ఆప్ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కొనసాగే అవకాశం లేదు. అఖిలేశ్‌యాదవ్, సీపీఐ నేతలు మాత్రం అక్కడక్కడా పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ మద్దతు లేకుండా బీజేపీపై గెలుపు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌తో ఇప్పటికిప్పుడు కలిసే అవకాశం లేదు. దీంతో.. బీఆర్‌ఎస్‌తో కలిసి వచ్చే పార్టీలపై క్లారిటీ రావాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.