Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్దుల్లో ముగ్గురికి బీ–ఫాంలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లు సమాచారం. అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పుపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, చేవెళ్ల, బోథ్ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని, వారికి బీ ఫారాలు ఇవ్వొద్దని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. ఇదే సమయంలో తుది జాబితా ఫైనల్‌చేసినట్లు తెలిసింది.
మూడో జాబితా సిద్ధం..
తెలంగాణలోని 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాలపై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు.. కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని తుది జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరాలకు అభ్యర్దులను ప్రకటించటంతోపాటుగా.. సీపీఐకు కేటాయించినట్లుగా చెబుతున్న కొత్తగూడెంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి– రమేశ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. తుంగతుర్తి సీటు కోసం పోటీ కొనసాగుతోంది. బాన్సువాడలో ఏనుగు బాలరాజు – రవీందర్ రెడ్డి మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నారాయణ ఖేడ్ లో సంజీవరెడ్డి – సురేశ్ షెట్కర్‌లో ఎవరికి సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ పోటీ చేయటం ఖాయమైంది. పటాన్ చెరులో కాట శ్రీనివాసగౌడ్ తో పాటుగా నీలం మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బీఫాంల ఇవ్వకుండా..
వనపర్తి, చేవెళ్ల, బోథ్ అభ్యర్థులను ఇదివరకే ప్రకటించిన కాంగ్రెస్ వారికి బీపాంలు ఇవ్వలేదు. ఆదివారం 60 మందికి బీఫాంలు అందించింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మెఘారెడ్డికి, బోథ్‌లో వెన్నెల అశోక్ స్థానంలో నరేశ్‌జాదవ్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. చేవెళ్లపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు, కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ దాదాపు ఖారరైంది. దీంతో, షబ్బీర్ అలీకి నిమాజాబాద్ అర్బన్ సీటును ఈ జాబితాలో ప్రకటించటం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే, చివరి నిమిషంలో ఈ సీటు కోసం ధర్మపురి సంజయ్ పేరు తెర మీదకు వచ్చింది. కామారెడ్డిలో రేవంత్ ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అదే రోజున అక్కడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యా బీసీ డిక్ల్లరేషన్ ప్రకటించేలా నిర్ణయించారు.
టిక్కెట్లు ప్రకటించి షాక్..
కాంగ్రెస్ ఇప్పటికే వంద మందికి టికెట్లు ప్రకటించింది. అయితే ఎప్పటికప్పుడు అభ్యర్థుల బలాబలాను పరిశీలిస్తూ.. వారి పని తీరును అంచనా వేస్తూ బీఫాంను ఆపేయాలని .. కొత్త అభ్యర్థులకు చాన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో సీనియర్లనూ వదిలి పెట్టడం లేదు. వనపర్తి అభ్యర్థి జి.చిన్నారెడ్డి బీఫాం ఆపేశారు. తనది సీఎం స్థాయి అని ఆయన చెప్పుకుంటున్నారు కానీ.. ప్రజల్లో పలుకుబడి పూర్తిగా కోల్పోయారని.. యువనేతకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన బీఫాం ఆపేశారు. చేవెళ్ల అభ్యర్థి భీంభరత్, బోధ్ అభ్యర్థి వన్నెల అశోక్ కు బీఫామ్‌లు ఆపేయాలని అధిష్టానం ఆదేశించింది. వీరు టిక్కెట్ ప్రకటించిన తరవాత కూడా ఏ మాత్రం వ్యూహం లేకుండా ఉన్నారని ప్రత్యర్థికి విజయాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారని క్లారిటీ రావడంతో అక్కడ టిక్కెట్ కోసం పోటీ పడిన ఇతర నేతలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.
మూడు పార్టీల్లోనూ టికెట్ల పెండింగ్..
ప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో టికెట్లు ప్రకటించలేదు. తుది జాబితా సోమవారం విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్దుల్లో కొందరిని మార్చే అవాకాశం ఉందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటు కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న మార్పులతో బీఆర్‌ఎస్ అలర్ట్ అయింది. కొందరికి బీ –ఫాంలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. ఆలంపూర్ అభ్యర్థిపై చర్చ సాగుతోంది. గోషామహల్ అభ్యర్దిని ఖరారు చేయాల్సి ఉంది. అటు బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లు ఖరారు చేసింది. శేరిలింగంపల్లి పైన రెండు పార్టీలు పట్టు పడుతున్నాయి. దీంతో, దాదాపుగా ఈ రాత్రికి తెలంగాణలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.