కేంద్రంలో రాష్ట్రంలో రెండు సార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. డీప్ ట్రబుల్స్ లో ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు నడుం బిగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ముందుగా రాష్ట్రాలను సెట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా.. సీనియర్లను, ఔట్ డేటెడ్ లీడర్లుగా ముద్రపడిన వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తోంది. అభ్యంతరాలన్నీ చెత్తబుట్టలో విసిరేసి.. తెలంగాణలో రేవంత్ కు, పంజాబ్ లో సిద్ధూకు పీసీసీ ఇవ్వడాన్ని గమనించొచ్చు. అటు రాజస్థాన్ లో సైతం విభేదాలను సెట్ చేసే పనిలో పడింది. అయితే.. సీనియర్లను చుట్టూ పెట్టుకొని వీరు పార్టీని ఎలా లీడ్ చేస్తారన్నది కీలక ప్రశ్న.
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు అంటే.. కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తారు. పార్టీ పరంగా చూసుకున్నప్పుడు సీఎం హోదాగా భావిస్తారు. అందుకే.. ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవాలని తహతహలాడుతుంటారు చాలా మంది నేతలు. కోరిక అందరికీ ఉండొచ్చు. కానీ.. కావాల్సింది సమర్థత. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఇది అనివార్యత కూడా. అందుకే.. సీనియారిటి, విధేయత వంటి అంశాలను పక్కన పెట్టి, సమర్థతనే అందలం ఎక్కించింది అధిష్టానం.
తెలంగాణలో తమను కాదని రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్లలో దాదాపుగా ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారనేది వాస్తవం. దీన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయగలరో.. అన్నీ చేశారు. దశాబ్దాలుగా పార్టీని పట్టుకు వేళాడుతున్న తమను కాదని, వేరే పార్టీలో నుంచి వచ్చిన రేవంత్ కు ఎలా ఇస్తారని రగిలిపోయారు. సీనియర్లలోనే ఒకరికి ఇవ్వాలి తప్ప, రేవంత్ కు ఇస్తే అంగీకరించేది లేనే లేదని చెప్పివచ్చారు. ఆ తర్వాత.. సీనియారిటీ పాచిక పారట్లేదని భావించి.. విధేయతను ముందుకు తెచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విధేయులుగా ఉన్నవారికే పీఠం ఇవ్వాలనే డిమాండ్ ముందుకు తెచ్చారు. ఈ విధంగా అవకాశం ఉన్న అస్త్రాలన్నీ వాడేశారు. అయినప్పటికీ.. అధిష్టానం రేవంత్ కే పగ్గాలు అప్పగించింది.
అయితే.. అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక మౌనంగా ఉన్నారుగానీ.. సీనియర్ల మనసులో మాత్రం కుతకుతలాడుతూనే ఉందట. ఎంతో కాలంగా పార్టీలో ఉన్న తమను కాదని, మూడేళ్ల ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తికి పీపీసీ ఇవ్వడమేంటీ? అసలు.. అతని కింద తాము పనిచేయడమేంటీ? అని కారాలూ మిరియాలూ నూరుతున్నారట. అటు రేవంత్ మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. పార్టీలోకి ఇతర నేతలను తీసుకొచ్చే పనిచేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్, మహబూబ్ నగర్ బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. డీసీసీ కొడుకు కూడా హస్తం గూటికి చేరారు. ఇలా.. తనవంతు పని చేసుకుంటూ వెళ్తున్నారు రేవంత్.
అయినప్పటికీ.. సీనియర్లు మాత్రం రేవంత్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఒక జూనియర్, పరాయి పార్టీ నుంచి వచ్చినవాడు తమను రూల్ చేయడమేంటని మానసికంగా చచ్చిపోతున్నారట. ఇలాంటి వాళ్లు అవకాశం కోసం చూస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్నది అసలు పాయింటు. కాంగ్రెస్ రథాన్ని రేవంత్ ఎలా ముందుకు నడిపిస్తాడన్నది ఆసక్తికరం. సీనియర్లను ఎలా మేనేజ్ చేస్తాడన్నది అన్నింటికన్నా కీలకం.