Congress: నేనంటే నేను.. గెలవకముందే కాంగ్రెస్ లో ‘సీఎం’ల గోల!

కాంగ్రెస్‌ గెలుపుపై క్రమంగా ధీమా పెరుగుతుండడంతో పార్టీలో అసలు రాజకీయం మొదలవుతోంది. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా పూర్తిస్థాయి అభ్యర్థులనే కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించలేదు.

Written By: Raj Shekar, Updated On : October 18, 2023 11:25 am

Congress

Follow us on

Congress: తెంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల రోజులే గడువు ఉంది. ఈసారి అధికార బీఆర్‌ఎస్‌ను ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్‌ఎస్‌ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ప్రచారంలోకి కూడా అగ్రనేతలను దించుతోంది. మరోవైపు ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పాలనపై వ్యతిరేకత ఉందన్న అంచనాలు వేస్తోంది. సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని అంచనా వేస్తున్నాయి. పార్టీల సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పట్టు బిగిస్తోంది. కర్ణాటక ఎన్నికలు ఇచ్చిన బూస్ట్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తాడని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు డిసెంబర్‌ 9న ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఎల్‌బీ స్టేడియంకు అందరూ రావాలని ఆహ్వానించారు.

బయటకు వస్తున్న ‘‘సీఎం’’లు..
కాంగ్రెస్‌ గెలుపుపై క్రమంగా ధీమా పెరుగుతుండడంతో పార్టీలో అసలు రాజకీయం మొదలవుతోంది. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా పూర్తిస్థాయి అభ్యర్థులనే కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించలేదు. కానీ టీపీసీసీ చీఫ్‌ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టేశారు. తానే సీఎం అభ్యర్థి అన్నట్లుగా ఇండికేషన్‌ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ మార్కు రాజకీయం మొదలైంది. తాము కూడా సీఎం రేసులో ఉన్నామంటూ ఆశావహులు ముందుకు వస్తున్నారు.

అందరూ సీఎంలే..
కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. పార్టీ అధికారంలో లేకపోతే కంటికి కూడా కనిపించరు. కానీ ఎన్నికలు వచ్చే సరికి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని తెరపైకి వస్తారు. ఇలాంటి వారిలో జానారెడ్డి ఒకరు. ముఖ్యమంత్రి అవుతానని ఆయన మీడియాను పిలిచి చెప్పుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించింది లేదు. కేవలం సీనియర్‌ నేత అన్న ట్యాగ్‌ పెట్టుకుని ఇలాంటి స్టేట్‌ మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఇలాంటి నేతల్ని చాలా వరకూ హైకమాండ్‌ కట్టడి చేసింది. ఇతర పార్టీలు ఇలాంటి కాంగ్రెస్‌ నేతల డిమాండ్లను చూపించి కాంగ్రెస్‌లో ఆరు నెలలకో ముఖ్యమంత్రి వస్తారని సెటైర్లు వేస్తూ ఉంటారు. చాలా మంది నేతలు గతంలో ఇలాంటి ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు వారికీ ఓ క్లారిటీ ఉంది. పార్టీని ఎవరు నడిపిస్తున్నారో. ఎవరు మాస్‌ లీడరో స్పష్టత ఉంది. అయినా ఒకరి కష్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఏ మాత్రం సంకోచించబోమని జానారెడ్డి లాంటి వాళ్లు ముందుగానే రెడీ అవుతున్నారు.

పాజిటివ్‌ టాక్‌తో..
కాగ్రెస్‌కు ఏదైనా కొద్దిగా పాజిటివ్‌ వాతావరణం కనిపిస్తే చాలు కొంత మంది మీద పడిపోతారు. మాకంటే మాకు అని రచ్చ చేసుకుని.. వడ్డించిన విస్తరిని కలగాపులగం చేసుకుని.. ఎవరికీ ఏమీ దక్కకుండా చేసుకుంటారు. అలాంటి రాజకీయాలు ఇప్పుడు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క తామూ సీఎం రేసులో ఉన్నామంటున్నారు. రేవంత్‌రెడ్డి ఆల్‌రెడీ ఫిక్స్‌ అయ్యారు. తాజాగా ఇందులో జానారెడ్డి చేరారు. కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలను నింజ చేస్తారా లేక.. కలహాలు లేని కాంగ్రెస్‌ అని నిరూపిస్తారా చూడాలి.