Homeజాతీయ వార్తలునిల‌బెట్టినా.. ప‌డ‌గొట్టినా.. రేవంత్ రెడ్డినే!

నిల‌బెట్టినా.. ప‌డ‌గొట్టినా.. రేవంత్ రెడ్డినే!

తెలంగాణ కాంగ్రెస్ లో.. గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్థితిని ఇక‌పై చూడ‌బోతున్నాం. గ్రూపు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన హ‌స్తం పార్టీలో.. నేత‌ల పంచాయ‌తీలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఎవ‌రికి వారేయ‌మునా తీరే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇలా చేసే.. తెలంగాణ‌లో పార్టీని ముంచేశారు. రెండు సార్లు అధికారానికి దూర‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు సిద్ధ‌మైన అధిష్టానం.. అభ్యంత‌రాల‌న్నీ ప‌క్క‌కు నెట్టేసి, రేవంత్ రెడ్డి నెత్తిన కిరీటం పెట్టేసింది.

రేవంత్ కు అవ‌కాశం ఇవ్వ‌డాన్ని మొద‌ట్లో కాంగ్రెస్ సీనియ‌ర్లు జీర్ణించుకోలేక‌పోయారు. కానీ.. రోజుల్లోనే ఈ ప‌రిస్థితి మారిపోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. రేవంత్ కు పీసీసీ ఇచ్చిన త‌ర్వాత సీనియ‌ర్లు పెద్ద ఎత్తున గోల చేస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ.. కోమ‌టిరెడ్డి మిన‌హా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు. ఆయ‌న కూడా ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. అదే స‌మ‌యంలో సీనియ‌ర్లంద‌రినీ చుట్టేశారు రేవంత్‌. జానా రెడ్డి, వీహెచ్, భ‌ట్టి అంద‌రినీ క‌లిశారు. కూల్ చేశారు.

ఇక‌, కేడ‌ర్ ప‌రిస్థితి చూస్తే.. అసాధార‌ణంగా ఉంది. నిన్నామొన్న‌టి వ‌ర‌కు కుంగి కృశించిపోయిన శ్రేణుల్లో నూత‌నోత్తేజం తొణికిస‌లాడుతోంది. రేవంత్ ప్ర‌మాణ‌స్వీకారానికి జ‌రుగుతున్న ఏర్పాట్లే ఇందుకు నిద‌ర్శ‌నం. రేవంత్ రెడ్డి తెలంగాణ‌ పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణం చేయ‌బోతుండ‌గా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తున్నంత హ‌డావిడి సాగుతోంది. హైద‌రాబాద్ ను బ్యాన‌ర్ల‌తో, ఫ్లెక్సీల‌తో ముంచెత్తారు. త‌ద్వారా.. రేవంత్ ను కేడ‌ర్ ఎంత‌గా ఓన్ చేసుకుందో అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితిని ఇత‌ర పార్టీల‌తోపాటు కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా అంచ‌నా వేయ‌లేక‌పోయారు.

రేవంత్ కు పీసీసీ చీఫ్ కావాల‌ని కేడ‌ర్ ఎందుకు కోరుకుందో.. ఇప్పుడు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న త‌ర్వాత సీనియ‌ర్లు అనివార్యంగా రేవంత్ రెడ్డికి మద్ద‌తు ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అందుకే.. ఒక్కొక్క‌రుగా రేవంత్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ కు పీసీసీ ద‌క్క‌కుండా ఏం చేయాలో అన్నీ చేసిన సీనియ‌ర్లు.. ఒక్కొక్క‌రుగా ఓపెన్ గా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీధ‌ర్ బాబు, వీహెచ్, జ‌గ్గారెడ్డి వంటివాళ్లు రేవంత్ నాయ‌క‌త్వంలో పోరాటం సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదేవిధంగా.. మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా.. రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ అధికారం సాధిస్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

రేవంత్ రెడ్డికి పీసీసీ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఎన్నో అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సీనియ‌ర్ల‌ను త‌ట్టుకొని ఎలా నిల‌బ‌డ‌తాడ‌నే డౌట్లు రైజ్ అయ్యాయి. అధిష్టానం క‌ట్ట‌బెట్టింది గానీ.. నిల‌బెట్టుకోవ‌డం ఈయ‌న‌కు క‌ష్ట‌మేన‌ని అన్నారు. కానీ.. ప్ర‌మాణ స్వీకారం కూడా చేయ‌క‌ముందే అన్నీ సెట్ చేసేశాడు రేవంత్‌. ఇక‌, భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది అన్న‌ది పాయింటు.

దాదాపుగా సీనియ‌ర్లంతా అనివార్యంగా ఏక‌తాటిపైకి వ‌చ్చేసిన‌ట్టే. కేడ‌ర్ మొత్తం రేవంత్ ప‌క్షాన ఉన్న త‌ర్వాత అసంతృప్తులు పెట్టుకొని తాము ఏమీ చేయ‌లేమ‌నే విష‌యం వారికి అర్థ‌మైపోయింది. అదీగాకుండా.. రెండుమార్లు అధికారానికి దూరంగా ఉన్న ప‌రిస్థితి. అందుకే.. ఒక్క‌ట‌య్యారు. ముందుగా యుద్ధం చేద్దాం.. వాటా సంగ‌తి త‌ర్వాత చూద్దాం అన్న పద్ధ‌తిలో రేప‌టి నుంచి కాంగ్రెస్ పోరాటం ఉండ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి, పీసీసీ ట్రైన్ కు డ్రైవ‌ర్ గా ఉన్నాను అని ప్ర‌క‌టించిన రేవంత్.. దాన్ని విజ‌య తీరాల‌కు చేరుస్తాడా? బోల్తా కొట్టిస్తాడా? ఏం జ‌రిగినా బాధ్య‌త రేవంత్ రెడ్డిదే.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular