అమావాస్య, పౌర్ణమికి వచ్చే చంద్రుడి వలే టీకాంగ్రెస్ తీరు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న ధాన్యం కొనుగోళ్లపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ దీక్షలతో సందడి చేశారు. ఆ తర్వాత పక్షం రోజులకు మరో ఎజెండాతో ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్లీ అలజడి నెలకొంది. ఈసారి ప్రజా సమస్యలే ఎజెండా టీకాంగ్రెస్ కార్యాచరణ ఉండబోతోందట.. మొట్టమొదటిగా వలస కార్మికుల ఎజెండాను కాంగ్రెస్ చేపట్టింది. ఆ తర్వాత నీళ్ల పోరాటం.. ఉద్యోగుల వేతనాలపై ముందుకెళుతోంది. నిరుపేదలకు జీవనోపాధి కల్పించే అంశంపై కూడా పోరుబాటకు శ్రీకారం చుట్టబోతోందని సమాచారం.
*వలస కార్మికులదే మొదటి ఎజెండా?
లాక్ డౌన్ ఆంక్షల వల్ల సమస్యల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులపై టీ కాంగ్రెస్ మొదటి ఎజెండా రూపొందించుకున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్వయంగా రంగంలోకి దిగి.. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఒడిషా కార్మికుల కష్టాలకు చెలించి ఏకంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి పంపించారు కాంగ్రెస్ నేతలు.. వారికి 10వేల రూపాయల సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
*ప్రాంతీయ నీళ్ల పోరాటానికి కాంగ్రెస్ సై
ఇక ప్రాంతీయ నీళ్ల పోరాటానికి కాంగ్రెస్ సై అంటోంది. మంజీరా డ్యామ్ కు నీళ్ల సమస్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజా ఉద్యమం చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చేనెల 4న టీకాంగ్రెస్ నేతృత్వంలో మంజీరాడ్యామ్ వద్ద ధర్నాకు టీపీసీసీ పిలుపునిచ్చింది.
*ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం..
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. పెన్షనర్స్ కు మూడు నెలలుగా సగం జీతం ఇవ్వడంపై కాంగ్రెస్ పోరుబాటకు సిద్ధమైంది. ధనిక రాష్ట్రమన్న కేసీఆర్.. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
ఇలా వరుసగా మూడు సమస్యలపై కార్యాచరణ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. వలస కార్మికులు.. నీళ్ల పోరాటం.. ఉద్యోగుల వేతనాలను ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లడానికి కాంగ్రెస్ రెడీ అవుతోంది. మరి ఈసారి తెలంగాణ సర్కార్ కు ప్రతిపక్ష కాంగ్రెస్ ఏ మేరకు సెగ చూపిస్తుందన్నది వేచి చూడాలి.
-నరేశ్ ఎన్నం