KCR : ఓవ‌ర్ టూ ఢిల్లీ.. కేసీఆర్ మ‌రో గేమ్ మొద‌లు పెడుతున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ ఎస్ కార్యాల‌య శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్‌.. ఈ ఒక్క ప‌నే కాకుండా.. రాజ‌కీయాల‌ను కూడా చ‌క్క‌బెట్టుకొచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్టుగా తెలుస్తోంది. కేవ‌లం భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌డానికే గులాబీ ద‌ళ‌ప‌తి హ‌స్తినాపురికి చేరుకున్నార‌ని గులాబీ శ్రేణులు ముందునుంచీ చెబుతున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో పొలిటిక‌ల్ ఎజెండా కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో భాగంగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసేందుకు కేసీఆర్ చూస్తున్నార‌ని, ఈ మేర‌కు అపాయింట్ మెంట్ కోసం […]

Written By: Bhaskar, Updated On : September 3, 2021 11:31 am
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ ఎస్ కార్యాల‌య శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్‌.. ఈ ఒక్క ప‌నే కాకుండా.. రాజ‌కీయాల‌ను కూడా చ‌క్క‌బెట్టుకొచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్టుగా తెలుస్తోంది. కేవ‌లం భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌డానికే గులాబీ ద‌ళ‌ప‌తి హ‌స్తినాపురికి చేరుకున్నార‌ని గులాబీ శ్రేణులు ముందునుంచీ చెబుతున్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లో పొలిటిక‌ల్ ఎజెండా కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇందులో భాగంగా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసేందుకు కేసీఆర్ చూస్తున్నార‌ని, ఈ మేర‌కు అపాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. దీంతో.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

రాజ‌కీయాల‌పై ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్న‌వారికైనా.. కేసీఆర్ వ్యూహాల గురించి తెలుసు. తెలంగాణ ఉద్య‌మం మొద‌లు.. రాష్ట్రం సాధించేదాకా.. అనంత‌రం పాల‌నా ప‌గ్గాలు చేపట్టిన త‌ర్వాతా.. కేసీఆర్ అమ‌లు చేసిన వ్యూహాలు.. అప‌ర చాణక్యుడిగా నిల‌బెట్టాయి. ఇటీవ‌ల‌ జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల వేళ టీఆర్ ఎస్ ప‌ని అయిపోయిన‌ట్టే అనేలా బీజేపీ నేత‌లు సాగించిన ప్ర‌చారానికి, దూకుడుకు ఒకే ఒక ప‌ర్య‌ట‌న‌తో చెక్ పెట్టి, త‌న వ్యూహానికి ఉన్న ప‌దును ఎంతో చాటిచెప్పారు కేసీఆర్‌. గ్రేట‌ర్‌ ఫ‌లితాల అనంత‌ర‌మే ఢిల్లీ బ‌య‌ల్దేరిన కేసీఆర్‌.. మోడీ, అమిత్ షా వంటి బీజేపీ పెద్ద‌లతో మంత‌నాలు జ‌రిపారు. ఫొటోలు దిగారు. మీడియాకు వ‌దిలారు. ఏం మాట్లాడార‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. సీన్ క‌ట్ చేస్తే.. బీజేపీ జోరు మాత్రం పూర్తిగా నార్మ‌ల్ కు వ‌చ్చేసింది.

ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌మావేశానికి సిద్ధ‌మ‌వుతుండ‌డంతో.. ఈ సారి ఏం చేయ‌బోతున్నారు? అనే చ‌ర్చ రాష్ట్రంలో న‌డుస్తోంది. ఊర‌క రారు మ‌హానుభావులు అన్న‌ట్టుగా.. కేసీఆర్ వంటి ముఖ్య‌మంత్రి కుశ‌లప్ర‌శ్న‌లు వేయ‌డానికైతే ప్ర‌ధానిని క‌ల‌వ‌రు. ఖ‌చ్చితంగా ఏదో వ్యూహం ఉంటుంది. అదేంటీ? అన్న‌దే ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌.

కేసీఆర్ ఢిల్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. అస‌లు మోడీతో యుద్ధ‌మే అన్న‌ట్టుగా మాట్లాడారు. సారు.. కారు.. ప‌ద‌హారు.. అంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. అనుకున్న‌ట్టుగా సీట్లు గెల‌వ‌క‌పోవ‌డం.. క‌మ‌ల‌ద‌ళం జోరు అప్పుడు మ‌రోలా ఉన్న నేప‌థ్యంలో ఆ వ్యూహాన్ని ప‌క్క‌న ప‌డేశారు. కేటీఆర్ ముఖ్య‌మంత్రి అనే ఊహాగానాల‌కు సైతం తాత్కాలికంగా తెర‌దించారు.

అయితే.. అప్ప‌టితో పోలిస్తే, ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిస్థితి కాస్త శాంతంగానే ఉంది. మ‌రి, జాతీయ రాజ‌కీయాల్లో చోటు సంపాదించేందుకు మ‌ళ్లీ యాక్టివ్ ప్లాన్ అమ‌లు చేయ‌బోతున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎన్డీఏలో చేరాల‌నే ఆలోచ‌న కూడా కేసీఆర్ చేస్తున్నార‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోర‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది అన్న‌ది చూడాలి.