Telangana BJP: దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించి బీజేపీ హైకమాండ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన భావిస్తున్న పార్టీ హైకమాండ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10 నుంచి జనంలోకి వెళ్లేలా భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈమేరకు హైకమాండ్ తెలంగాణ పార్టీ నేతలకు టార్గెట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

పార్టీని జనంలోకి తీసుకెళ్లేలా..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై, బూత్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నివేదికలు తెప్పించుకుంది. నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం చేయడానికి ఏం చేయాలో రాష్ట్ర నాయకులకు దిశనిర్దేశం చేసింది. ప్రజా క్షేత్రంలోకి బలంగా వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. బీపేపీపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడానికి, పార్టీ గుర్తు కమలం పువ్వును ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకువెళ్లడానికి ఇప్పటికే రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు బలంగానే ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్రశాఖ నిర్ణయించింది.
బూత్‌లోవల్‌లో పార్టీ బలోపేతానికి కసరత్తు..
బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఇన్‌చార్జీల నియామక ప్రక్రియను పూర్తి చేసి, ప్రజల మద్దతు కూడగట్టే పనిని రాష్ట్ర నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 6 వరకు బూత్‌లెవల్‌లో పార్టీని బలోపేతం చేయాలని డెడ్‌లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఏప్రిల్ 6 బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలంగా చూపించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

ఫిబ్రవరి 10 నుంచి ప్రజాక్షేత్రంలోకి..
బూత్‌లెవల్ కార్యాక్రమాలు కొనసాగిస్తూనే ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడం కోసం, ప్రజల సంపూర్ణ మద్దతుతో తెలంగాణలో అధికారం చేపట్టడం కోసం ఫిబ్రవరిలో 15 రోజులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 9 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతీరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వీధుల్లో రచ్చ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో మద్దతు కోసం, బీజేపీని బూత్ లెవెల్‌లో బలోపేతం చేయడం కోసం హైకమాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది… స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయి అన్నది చూడాలి.