తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇస్తే వచ్చింది? తెలంగాణ ఉద్యమంలో ఎవరు ముందుండి నడిచారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేందుకు ఎవరు లేఖ ఇచ్చారు? తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో జరిగిన చర్చలో ఎవరు మద్దతు పలికారు? పైవేవీ గొట్టు ప్రశ్నలు కాదు. కానీ ఇప్పుడు ఎన్నికల కాలం కాబట్టి.. అధికారాన్ని దక్కించుకోవాలి కాబట్టి రాజకీయ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి పేటెంట్ ను దక్కించుకునేందుకు రకరకాల విమర్శలు చేసుకుంటున్నాయి. మేము ఉద్యమం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని భారత రాష్ట్ర సమితి చెబుతోంది. సోనియా ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదా అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. మేము లేఖ ఇచ్చాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని టిడిపి వివరిస్తోంది. నాడు పార్లమెంటులో జరిగిన చర్చలో మద్దతు పలికాము కాబట్టే తెలంగాణ ఏర్పాటుకు అడుగు ముందుకు పడిందని బిజెపి వాదిస్తోంది. ఇందులో ఎవరిని తప్పుపట్టేందుకు లేదు. కానీ ఒకసారి చరిత్రను పరిశీలిస్తే..
అప్పట్లో భీకర ఉద్యమం
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జరిగిన ఉద్యమాలలో.. 1969 లో జరిగిన ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉంది.. నాడు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తమ ప్రాణాలను అర్పించుకున్నారు. ఆంధ్రకు అత్యంత దగ్గరగా ఉండే ఖమ్మం జిల్లాలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం పురుడు పోసుకుంది. నాడు కేటీపీఎస్ కేంద్రంగా పోటు కృష్ణమూర్తి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అన్నా బత్తుల రవీంద్రనాథ్, గార్ల మండలానికి చెందిన జైన్.. తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించుకున్నారు. అప్పట్లో వీరి మరణాల తర్వాత ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. అప్పట్లో రాజకీయంగా సపోర్ట్ లభించినప్పటికీ తెలంగాణ కల సాకారం కాలేదు. ఇందిరాగాంధీ హయాంలో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అడుగు ముందుకు పడలేదు కాబట్టి స్వరాష్ట్రకాంక్ష నెరవేరలేదు.
సోనియాగాంధీ చొరవతో..
తెలంగాణ ఏర్పాటు అనేది రాజకీయ అనివార్యత అనే పరిస్థితికి దారి తీసినప్పుడు నాడు యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ రెండవ మాటకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అందువల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. ఇదే విషయాన్ని పలుమార్లు కేసీఆర్ కూడా ప్రకటించారు.. బిజెపి కూడా తెలంగాణకు మద్దతు పలికిందని వివరించారు. ఖమ్మం జైల్లో వేసినప్పుడు తనను కమ్యూనిస్టు నాయకులు కాపాడుకున్నారని కొనియాడారు. ఇన్ని పరిణామాలు చరిత్రలో నిక్షిప్తమైనప్పటికీ.. తమ రాజకీయం కోసం అన్ని పార్టీలు తెలంగాణ పేటెంట్ కోసం విమర్శలు చేసుకుంటూ ఉండడం విసుగు కలిగిస్తోంది. తెలంగాణ ఏర్పాటయింది.. అది జరిగి 9 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేశామో అటు ప్రభుత్వం చెప్పడం లేదు. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడంతో కాలేశ్వరం విషయాన్ని భారత రాష్ట్ర సమితి ప్రమోట్ చేసుకోవడం లేదు. డిసెంబర్ 9 ప్రకటన తీసుకోవడం వల్ల ఎంతటి అనర్ధాలు జరిగాయో కాంగ్రెస్ చెప్పడం లేదు.. అటు బిజెపి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను చెప్పడం లేదు. కానీ ఒకరిపై ఒకరు మాత్రం బురద చల్లుకుంటున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం.. తెలంగాణ కాంక్ష అనేది సాధించుకోవాలని సబ్బండ వర్గాలు రోడ్లమీదకి వచ్చి ఉద్యమాలు చేశాయి. ఇక తప్పనిసరి పరిస్థితి కావడంతో రాజకీయ పార్టీలు ఆ ఉద్యమ ఆకాంక్షకు మద్దతు పలికాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యానాలు చేయవచ్చు గాక.. కానీ చరిత్ర మాత్రం అబద్దం చెప్పదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana assembly elections another fight over self state patent
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com