Telangana Assembly Election: ఉత్తరాధి అధికారులను దించి కేసీఆర్ కు షాకిచ్చిన ఈసీ.. ప్రతిపక్షాల ప్లానేనా?

ఎన్నికల సమయంలో మద్యం, వస్తురూపంలో ప్రలోభాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖలను ఈసీ బలోపేతం చేసింది.

Written By: Bhaskar, Updated On : October 14, 2023 9:43 am

Telangana Assembly Election

Follow us on

Telangana Assembly Election: ఎన్నికల ముంగిట అధికార భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని షాక్. ఇన్నాళ్లు కీలక స్థానాల్లో పాతుకుపోయిన అధికారులకు తిరుగులేని షాక్. ప్రతిభ ఉన్నా ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉన్న అధికారులకు కొంత ఊరట. ముక్కుసూటిగా పనిచేసే అధికారులకు అందలం. మొత్తానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అలజడికి కారణమైంది. అంతేకాదు అధికార భారత రాష్ట్ర సమితిలో ఆందోళనకు హేతువైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పక్కనబెట్టిన 20 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అధికారులను నియమించింది. 20 మంది కొత్త అధికారుల నియమాకానికి ముగ్గురేసి పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి జాబితా పంపించగా, అందులో ఒక్కొక్కరిని ఒక్కో పోస్టుకు ఈసీ ఎంపిక చేసింది.

ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల బలోపేతం

ఎన్నికల సమయంలో మద్యం, వస్తురూపంలో ప్రలోభాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖలను ఈసీ బలోపేతం చేసింది. రెండు శాఖలకు కలిపి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని, రెండు శాఖలకు కమిషనర్లను, నాలుగు జిల్లాల కలెక్టర్‌ పోస్టులను భర్తీ చేసింది. మూడు ప్రధాన నగరాలకు పోలీసు కమిషనర్లను, 10 జిల్లాలకు ఎస్పీలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం వేర్వేరు జీఓలను జారీ చేశారు. సీఎస్‌ ఆదేశాల మేరకు కొత్త పోస్టింగులు పొందిన వారంతా సాయంత్రం 4 గంటలలోగా విధుల్లో చేరారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం పంపిణీని నియంత్రించాల్సి ఉంటుందని, ఆదాయాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖకు సీనియర్‌ అధికారి అవసరం ఉందని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. రెండు శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల అధికారిని నియమించాలని చెప్పింది. దాంతో విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్‌ శర్మను ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తీసుకొచ్చారు. రెండు శాఖలకు పూర్తి స్థాయి కమిషనర్లను నియమించారు.

లూప్ లైన్ లో ఉన్న అధికారులకు..

చాలాకాలంగా లూప్‌లైన్‌ ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు క్రిస్టినా జడ్‌.చోంగ్తును కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా, డా.జ్యోతి బుద్ధా ప్రకా్‌షను ఎక్సైజ్‌ కమిషనర్‌గా నియమించింది. పెద్దగా ప్రాధాన్యం లేని ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ పోస్టులో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాణీ ప్రసాద్‌ను కీలకమైన రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల సమయంలో వాహనాల తనిఖీల్లో రవాణా శాఖ కీలకపాత్ర పోషించనుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా లూప్‌లైన్‌ పోస్టులో పెట్టారని అసంతృప్తితో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ భారతీ హొళికెరికి ఎన్నికల సంఘం నిర్ణయాల నేపథ్యంలో కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు దక్కాయి.

పోలీసు కమిషనర్‌గా శాండిల్య

పోలీసు శాఖలో డీజీపీ తర్వాత అత్యంత కీలకమైన హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న సీవీ ఆనంద్‌ ఈసీ ఆదేశాలతో బదిలీ అయ్యారు. ఏడీజీ హోదాలో ఉన్న పలువురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను ఈ పోస్టుకు ప్రభుత్వం పరిశీలించింది. సందీప్‌ శాండిల్యను ఎంపిక చేశారు. శాండిల్యకు గతంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. రాచకొండ కమిషనరేట్‌ జాయింట్‌ సీపీగా ఉన్న అంబర్‌ కిషోర్‌ ఝా వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. గతంలో రాచకొండ జాయింట్‌ సీపీగా ఉన్న సత్యనారాయణ నిజామాబాద్‌ సీపీగా బదిలీ అయిన తర్వాత కొద్ది రోజులపాటు ఆ పోస్టు ఖాళీగా ఉంది. గత ఆదివారమే ప్రభుత్వం అంబర్‌ కిషోర్‌ ఝాను రాచకొండ జాయింట్‌ సీపీగా నియమించింది. ఇంతలోనే ఆయన బదిలీ అయ్యారు. కల్మేశ్వర్‌, రూపే్‌షతోపాటు మరికొందరు ఆయా కమిషనరేట్ల పరిధిలో కీలక విభాగాల్లో ఉన్న వారే. వారి బదిలీలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇతర ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయనుంది. త్వరలో జరగబోయే ఐపీఎస్ ల బదిలీల్లో పలు కీలక పోస్టుల్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉంది.

త్వరలో మరికొన్ని బదిలీలు

త్వరలో మరికొంత మంది ఐఏఎస్ లు, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగనున్నాయి. వీటికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విద్యుత్తు శాఖ ప్రత్యేక కార్యదర్శి పోస్టు నుంచి సునీల్‌ శర్మ బదిలీ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. చేనేత, జౌళి శాఖ, కీలకమైన పరిశ్రమల శాఖ కమిషనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌, సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌, సెర్ప్‌ సీఈఓ వంటి కొన్ని ముఖ్యమైన పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. పోలీసు శాఖలో ప్రధానమైన చాలా పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి. వీటి భర్తీ అవసరాన్ని వివరిస్తూ ప్రభుత్వం ఈసీకి లేఖ రాయనుంది. ఈసీ ఆదేశాలతో పోస్టులు కోల్పోయిన 20 మంది అధికారులను ఎన్నికలయ్యే వరకు వెయిటింగ్‌లోనే ఉంచుతారా? లేక ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టుల్లో నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.