Taliban: తెలుగు రాజ‌కీయాల్లో తాలిబ‌న్లు..!

Telangana and Andhra Pradesh, Taliban: తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలనేవి.. ప‌ని త‌క్కువ‌, మాట‌లు ఎక్కువ అనే స్థాయిని ఎప్పుడో దాటేశాయి. ఇప్పుడు ఆ ప్లేసును తిట్లు ఆక్ర‌మించేశాయి. తిట్టేవాడే మొన‌గాడు అన్న‌ట్టుగా త‌యారైంది ప‌రిస్థితి. ఈ తిట్ల‌ను కూడా ట్రెండ్ కు త‌గిన‌ట్టుగా వాడేయ‌డ‌మే ఇక్క‌డ స్పెషాలిటీ. ట్రెండింగ్ లో ఏది ఉంటే అది వాడేస్తూ.. ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద అన్న ప‌ద్ధ‌తిలో సాగిస్తున్నారు రాజ‌కీయాలు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ ఫుల్లుగా ట్రెండ్ అవుతున్న […]

Written By: Bhaskar, Updated On : August 23, 2021 11:39 am
Follow us on


Telangana and Andhra Pradesh, Taliban: తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలనేవి.. ప‌ని త‌క్కువ‌, మాట‌లు ఎక్కువ అనే స్థాయిని ఎప్పుడో దాటేశాయి. ఇప్పుడు ఆ ప్లేసును తిట్లు ఆక్ర‌మించేశాయి. తిట్టేవాడే మొన‌గాడు అన్న‌ట్టుగా త‌యారైంది ప‌రిస్థితి. ఈ తిట్ల‌ను కూడా ట్రెండ్ కు త‌గిన‌ట్టుగా వాడేయ‌డ‌మే ఇక్క‌డ స్పెషాలిటీ. ట్రెండింగ్ లో ఏది ఉంటే అది వాడేస్తూ.. ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద అన్న ప‌ద్ధ‌తిలో సాగిస్తున్నారు రాజ‌కీయాలు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ ఫుల్లుగా ట్రెండ్ అవుతున్న ప‌దం తాలిబ‌న్. మ‌రి, ఈ తెలుగు రాజ‌కీయాల్లోని తాలిబ‌న్ల వ్య‌వ‌హార‌మేంటో చూద్దాం.

ఆ మ‌ధ్య‌.. అంటే ఓ మూడేళ్ల క్రితం బాహుబ‌లిని రాజ‌కీయాల్లోకి గుంజుకొచ్చారు. మా బాహుబ‌లి ఆయ‌నే అంటూ గులాబీ నేత‌లు.. మాకూ బాహుబ‌లి ఉన్నాడంటూ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌క‌టించుకున్నారు. ‘‘ఎవ్వ‌డంట ఎవ్వ‌డంట నిన్ను ఎత్తుకుందీ..’’ అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ కూడా లోలోపల ప్లే చేసుకున్నారు. ఆ త‌ర్వాత మెల్ల మెల్ల‌గా థియేట‌ర్ల‌లో, జ‌నాల్లో బాహుబలి జోరు తగ్గింది. ఆటోమేటిగ్గా.. రాజ‌కీయ నాయ‌కులూ బాహుబ‌లిని ప్ర‌స్తావించ‌డం మానేశారు.

ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చారు తాలిబ‌న్లు(Taliban). ప్ర‌పంచం మొత్తం తాలిబ‌న్ గురించి క‌నీసం ఒక్క‌సారైనా చ‌ర్చించ‌కుండా రోజు ముగిసే ప‌రిస్థితి లేదు. ఇంత‌లా ట్రెండ్ అవుతున్న తాలిబ‌న్ల‌ను మ‌న రాజ‌కీయ‌నాయ‌కులు ఎందుకు వ‌దిలిపెడ‌తారు? పైగా.. తిట్టడానికి మాంచి బలమైన పదంగా ఉంది. ప్ర‌త్య‌ర్థుల‌కు సైతం గ‌ట్టిగా దెబ్బ త‌గిలేలా ఉంది. అందుకే.. రెండు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కులూ.. తాలిబ‌న్ల నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు.

తాలిబన్లకు టీఆర్ ఎస్ మద్దతు ఇస్తోందని బీజేపీ నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉంటూ తాలిబన్లకు సపోర్టు చేసే వాళ్లకు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తుగా ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్రతిగా గులాబీ నేతలు సైతం తాలిబన్ వ్యాఖ్యలు అందుకున్నారు. ఎన్నిక‌లు వ‌స్తే తాలిబ‌న్లు, రోహింగ్యాల పేరుతో బీజేపీ రాజ‌కీయం చేయ‌డం అల‌వాటుగా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఈ విధంగా తాలిబ‌న్ రాజ‌కీయం తెలంగాణ‌లో కొన‌సాగుతోంది.

అటు ఏపీ నేత‌లు సైతం తాలిబ‌న్ల‌ను లాక్కొచ్చారు. ముందుగా టీడీపీ నేత న‌క్కా ఆనంద్ బాబు అందుకున్నారు. ఏపీలో తాలిబ‌న్ల పాల‌న సాగుతోంద‌ని అన్నారు. మ‌రి, వాళ్లు వాడిన‌ప్పుడు తాము వాడ‌క‌పోతే ఎలా అనుకున్నారేమో.. వైసీపీ నేత‌లు సైతం తాలిబ‌న్ ప‌దాన్ని ఏకంగా టీడీపీ ఫుల్ ఫామ్ లో క‌లిపేశారు. టీడీపీ అంటే.. తెలుగు తాలిబ‌న్ల పార్టీ అనేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌. ఈ విధంగా తాలిబ‌న్ల‌ను స‌రిహ‌ద్దులు దాటించి తెలుగు రాజ‌కీయాల్లోకి లాక్కొచ్చేశారు రెండు రాష్ట్రాల నేత‌లు. ప్ర‌స్తుతం ట్రెండ్ అలా ఉంది కాబ‌ట్టి.. వాడేస్తున్నార‌న్న‌మాట‌. కానీ.. జ‌నం మాత్రం వీళ్ల వ్య‌వ‌హారం చూసి ఏవ‌గించుకుంటున్నారు. మ‌రి, తెలుగు రాజ‌కీయాల్లో ఈ తాలిబ‌న్లు ఎన్నాళ్లుంటారో చూడాలి.