ఈ ప్రపంచంలో ప్రతి మనిషినీ.. ప్రతి రంగాన్నీ ప్రభావితం చేసింది కరోనా. అయితే.. అందులో మెజారిటీగా నెగెటివ్ మార్పులే ఉన్నాయి. కానీ.. కొన్ని పాజిటివ్ లు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఓటీటీ డెవలప్ మెంట్. నిజానికి తెలుగులో ఓటీటీల శకం మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రజలకు ఇప్పట్లో ఆ అవసరం లేకుండె. కానీ.. కరోనా వచ్చి ఆ అనివార్యత కల్పించింది. దీంతో.. జనాలు తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి దగ్గరైపోయారు.
తెలుగులో ఏకంగా ఒక ఓటీటీ సంస్థ కూడా పుట్టుకురావడం విశేషం. ఎప్పుడైతే తెలుగు ఆడియన్స్ ఓటీటీలను ఆదరించడం మొదలు పెట్టారో.. సరికొత్త సిరీస్ లను నిర్మించాల్సిన అవసరం ఆయా సంస్థలకు ఏర్పడింది. ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటివి కూడా తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. ఇక, తెలుగు వారికోసం ఏర్పడిన ఓటీటీ ‘ఆహా’ కూడా భారీగానే వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది.
అయితే.. ఇప్పటి వరకూ ‘ఆహా’ చాలా సిరీస్ లు నిర్మించినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకున్నవి మాత్రం తక్కువేనని చెప్పాలి. ఇందులో.. ‘కుడి ఎడమైతే’, ‘30 వర్సెస్ 21’ సిరీస్ లు బాగా అలరించాయి. వీటి తర్వాత వచ్చిన సిరీస్ ‘తరగతి గది దాటి’. కలర్ ఫొటో సినిమాలో పాపులర్ అయిన తరగతి గది దాటి అనే పాటలోని పల్లవిని టైటిల్ గా చేసుకొని వచ్చిందీ వెబ్ సిరీస్. ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎక్కడా సోది లేకుండా.. సాగదీయకుండా.. చక్కగా ముందుకు సాగిందని పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మొత్తం ఐదు ఎపిసోడ్లుగా సాగిపోయిన ఈ సిరీస్ లో.. వినోదంతోపాటు ఎమోషన్ కూడా సమపాళ్లలో ఉండడం.. అందరినీ ఆకర్షిస్తోంది. హిందీలో వచ్చిన ‘ఫ్లేమ్స్’కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు మల్లిక్ రామ్. అవకాశం ఉంటే.. మీరు కూడా ‘తరగతి గది దాటి’ లోనికి వెళ్లిరండి.