Vehichle Seize : వాహ‌నం సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు ఉందా లేదా? క్లారిటీ ఇచ్చిన ఖాకీలు

బైక్ డ్రైవింగ్ లో వాహ‌న‌దారుడు ఎప్పుడో రూల్స్ బ్రేక్‌ చేస్తాడు. వెన‌క నుంచో.. ముందు నుంచో.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటో కొట్టేస్తాడు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తాడు. వాహ‌న‌దారుడు ఆ ఫైన్ చెల్లించాడో.. లేదో తెలియ‌దు. నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆ చ‌లానా పెండింగ్ లోనే ఉంటుంది. వ‌న్ ఫైన్ డే.. ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ మొద‌లు పెడ‌తారు. అప్పుడు చెక్ చేస్తే.. ఆ బండి చ‌లానా చాలాకాలంగా పెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు […]

Written By: Bhaskar, Updated On : August 23, 2021 7:22 am
Follow us on


బైక్ డ్రైవింగ్ లో వాహ‌న‌దారుడు ఎప్పుడో రూల్స్ బ్రేక్‌ చేస్తాడు. వెన‌క నుంచో.. ముందు నుంచో.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటో కొట్టేస్తాడు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తాడు. వాహ‌న‌దారుడు ఆ ఫైన్ చెల్లించాడో.. లేదో తెలియ‌దు. నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆ చ‌లానా పెండింగ్ లోనే ఉంటుంది. వ‌న్ ఫైన్ డే.. ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ మొద‌లు పెడ‌తారు. అప్పుడు చెక్ చేస్తే.. ఆ బండి చ‌లానా చాలాకాలంగా పెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందా? లేదా? ఈ డౌట్ ఎప్ప‌టి నుంచో వాహ‌న‌దారుల్లో ఉంది.

బైక్ తాళం తీసుకునే అధికారం పోలీసుల‌కు లేద‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా.. పెండింగ్ చాలానా ఉన్న‌ప్ప‌టికీ.. బండిని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ మేర‌కు ప్ర‌ధాన మీడియాలో కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లోని రాజేంద్ర న‌గ‌ర్ లో చ‌లానా పెండింగ్ ఉంద‌నే కార‌ణంతో ఓ లాయ‌ర్ బైక్ ను సీజ్ చేశారు. దీనిపై ఆయ‌న హైకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే.. ఈ కేసును ప‌రిశీలించిన న్యాయ‌స్థానం.. పెండింగ్ చ‌లాన్ పేరుతో వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదంటూ తీర్పు చెప్పింద‌ని వార్త‌లు ప్ర‌సార‌మ‌య్యాయి. దీనిపై సైబ‌రాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

ఈ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని కొట్టి పారేశారు. కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వ‌లేద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఇలాంటి ప్ర‌చారం చేసేవారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

లాయ‌ర్ వేసిన రిట్ పిటిష‌న్ ను విచారించిన న్యాయ‌స్థానం.. దాన్ని కొట్టేసింద‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు సీజ్ చేసిన వాహ‌నాన్ని విడుద‌ల చేయించుకునేందుకు పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కూడా స‌ద‌రు లాయ‌ర్ కు కోర్టు సూచించింద‌ని తెలిపారు. మోటార్ వెహికిల్ చ‌ట్టం ప్ర‌కారం.. స‌ద‌రు వ్య‌క్తి  పెండింగ్ చ‌లానాకు సంబంధించిన సొమ్ము చెల్లించిన త‌ర్వాత‌నే వాహ‌నాన్ని విడుద‌ల చేసిన‌ట్టు చెప్పారు. పిటిష‌న‌ర్ ఈ నిజాల‌న్నింటినీ దాచి.. త‌ప్పుడు ప్ర‌చారంతో వాహ‌న‌దారుల‌ను గంద‌ర‌గోళానికి గురిచేశార‌ని తెలిపారు.

కాగా.. ఫైన్ విష‌యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. చ‌లానా వేసిన త‌ర్వాత 90 రోజుల్లో దాన్ని చెల్లించాల్సి ఉంద‌న్నారు. లేక‌పోతే.. ఆ వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు ఉంద‌ని తెలిపారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 1987 ప్ర‌కారం ఈ హ‌క్కు పోలీసుల‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి.. రూల్స్ పాటిస్తూ వాహ‌నం న‌డ‌పాల‌ని, ఒక‌వేళ ఫైన్ విధిస్తే.. గ‌డువులోపు దాన్ని చెల్లించాల‌ని సూచించారు.