Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న.. ఇప్పటివరకూ అతడో స్వేచ్ఛ జీవి. అతడి నోటి నుంచి ఎలాంటి సునిశిత విమర్శలు, కౌంటర్లు వచ్చినా తెలంగాణ జనం అస్వాదించారు. అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ యాసలో కేసీఆర్ ను తిడుతుంటే సమ్మగా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు కథ మారింది. పార్టీ మారింది. స్వతంత్రుడు కాస్త కాషాయ ఉద్యమకారుడు అయ్యాడు. మరి ఇప్పుడు స్టాండ్ ఎలా ఉండనుందనేది ఆసక్తి రేపుతోంది.. ఈ జర్నలిస్ట్ కం సోషల్ మీడియా ఉద్యమకారుడికి తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ పాపులారిటీ ఉంది. అతడి యాస, భాష, రాజకీయాలపై చెణుకులు, విమర్శలను జనాలు తెగ ఎంజాయ్ చేస్తారు. అతడి యూట్యూబ్ వీడియోలకు వీక్షకాదరణ బాగా ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ పై మల్లన్న ప్రయోగించే పదజాలానికి తెలంగాణ సమాజం కూడా ఫిదా అవుతుంది. ఇప్పటిదాకా ప్రజల ఆవేదన, ఆగ్రహాలు, వారి అవసరాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా మల్లన్న చేసిన విమర్శలకు ప్రశంసలు కురిసాయి.
ఇన్నాళ్లు మల్లన్న ఒక్కడే. అతడు కేసీఆర్ ను ఎన్ని తిట్టినా.. ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినా.. బీజేపీ, కాంగ్రెస్ ను చీల్చిచెండాడిన అందులోని తప్పులు ఎత్తిచూపినా ఆయన వ్యక్తిగతం. ఆ విమర్శలను ప్రజలు స్వీకరించారు.
అయితే బీజేపీలో చేరాక తీన్మార్ మల్లన్న కథ ఖచ్చితంగా మారుతుంది. ఆ పార్టీ స్టాండ్ ప్రకారం వెళ్లాలి. ఎవరిపై పడితే వారిపై పడి విమర్శించడానికి లేదు. ఎవరినీ సొంతంగా తిట్టే పరిస్థితి ఉండదు. ఏం తిట్టినా అది బీజేపీ ఖాతాలో పడుతుంది.
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరాక ఆయనకు అంత ఫాలోయింగ్ ఉండదు. ఇన్నాళ్లు టీఆర్ఎస్ లోని కొంత మంది వ్యతిరేకులకు కూడా తీన్మార్ మల్లన్న అంటే ఇష్టం. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీల వారు కూడా మల్లన్నను ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు వారందరికీ మల్లన్న బీజేపీలో చేరడం సుతారం ఇష్టం ఉండదు. ఒక పార్టీ స్టాండ్ తీసుకోవడంతో మునుపటంతా పాపులారిటీ తీన్మార్ మల్లన్నకు ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తెలంగాణ సమాజంలోని బీజేపీ వ్యతిరేకుల తీన్మార్ మల్లన్నకు దూరం అయితే.. బీజేపీ ఫాలోవర్స్ కేడర్స్ మాత్రం మరింతగా ఆయనకు దగ్గరవుతారు.తీన్మార్ మల్లన్న నోరుకు ఇప్పుడు మూతపడ్డట్టే.
Also Read: ముందే ఊహించిన రేవంత్.. బీజేపీతో టీఆర్ ఎస్ ఒప్పందం..?
స్వతంత్ర్యంగా ఒక జర్నలిస్టుగా ఉండి మాట్లాడిన మాటలు.. ఇప్పుడు రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుడిగా మాట్లాడలేడు. రాజకీయ పార్టీలో ఉండి మల్లన్న మునుపటిలా అడ్డందిడ్డం మాట్లాడితే ఆ చెడ్డపేరు అంతా బీజేపీకి పోతుంది. పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది.
స్వతంత్ర్యంగా ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ఏది తిట్టినా నడిచింది. అందరూ ఈలలు గోలలు పెట్టి ప్రశంసించారు. కానీ బీజేపీలో చేరినప్పుడు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ నాయకత్వాన్ని అనసురించి క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేయాల్సి ఉంటుంది. అదే తీన్మార్ మల్లన్న ముందరి కాళ్లకు బంధం వేసేలా ఉంది.
Also Read: కేసీఆర్ కు చెక్ పెట్టే బీజేపీ వ్యూహం: కీలక నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా