Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరు. ఆయన సొంత యూట్యూబ్ చానల్‌లో లక్షలకొద్ది ఫాలోవర్స్‌ని రోజూ ఉదయం న్యూస్‌పేపర్ అనాలసిస్‌తో కలుస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ కేసీఆర్ పనులను విమర్శిస్తూ దానికి ఆధారాలనూ చూపుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడి రెండోస్థానంలో నిలిచారు. తక్కువ మెజార్టీతో అధికార పార్టీ అక్కడ గెలిచింది. అయితే కేసీఆర్ ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజల్లో పరపతి సంపాదిస్తున్న వారిని తన ఇంటలిజెన్స్ ద్వారా ఓ కంట కనిపెడుతూ ఉంటారు. ఇటీవల ఆయన్ని ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో స్వీయరక్షణ కోసం ఈటల రాజేందర్ మాదిరి ఆయనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే దిక్కయింది. దీంతో ఆయన భార్య మమత తన భర్తను జైలు నుంచి విడిపించాలని కోరుతూ అమిత్‌షాను కలిసారు. అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేజార్చుకోదు కదా! ఎట్టకేలకు ఇటీవల తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా సొంత యూట్యూబ్ చానల్‌లో పదునైన విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వంపై మరింత రెచ్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి వజ్రమే బీజేపీకి కావాలిప్పుడు. అనుకున్నట్టే తీన్మార్ మల్లన్న ఇవాళ ఉదయం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1982, జనవరి 17న యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పని చేసి 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తలు ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పని చేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. తీన్మార్ మల్లన్న వి6 లో ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ -ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తీన్మార్ మల్లన్న 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యారు. తీన్మార్ మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి రెండు సంవత్సరాల ప్రజల్లోనే ఉంటానని 2021, జూలై 18న ఘటకేసర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రకటించాడు. హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు ఆగష్టు 27, 2021న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగస్టులో చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేసింది. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇది వరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు.
Also Read: Jagan Govt: ఏపీలో గుట్కా, జర్ధా రాయుళ్లకు షాకిచ్చిన జగన్ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనను, కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, అక్రమాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్కార్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఎన్నికల బరిలోకి దిగిన ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై కొంతమేర ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం తెలంగాణ సర్కారుకు ఏమాత్రం రుచించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న తెలంగాణా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక తన కలానికి మరింత బలం పెంచి కేసీఆర్‌ను, కేటీఆర్, రాష్ట్ర మంత్రులను, నమస్తే తెలంగాణ పత్రికను, టీ న్యూస్ టీవీ చానెల్‌ను దునుమాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పార్టీ బలం ఉంటే మరింత దూకుడుగా తీన్మార్ మల్లన్న వ్యవహరించడం ఖాయం. రానున్న రోజుల్లో ఇదే జరగనుంది.
Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?