
Rahul Dravid: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వచ్చే టీ20 తరువాత జట్టు కోచ్ రవిశాస్త్రీ కాంట్రాక్టు ముగుస్తుంది. దీంతో జట్టుకు కొత్తగా ఎవరు కోచ్ గా వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారగా.. బీసీసీఐ స్థానిక సీనియర్ క్రికెటర్ నే కోచ్ గా నియమించాలని చూస్తోంది. ఇందుకోసం క్రికెట్ దిగ్గజం.. మిస్టర్ కూల్ రాహుల్ ద్రావిడ్ పేరును ఖరారు చేయగా.. ఆయన సముఖత చూపించలేదు. దీంతో నేరుగా రంగంలోకి దిగిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ద్రావిడ్ ను కోచ్ గా బాధ్యతలు తీసుకునేందుకు ఒప్పించాడు. ఈక్రమంలో అతిత్వరలో టీమిండియా నూతన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం కాబోతున్నారు. ఇన్నాళ్లు విదేశీ వ్యక్తికి టీమిండియా కోచ్ బాధ్యతలు అప్పగిస్తారన్న అపోహలకు కూడా తెరపడినట్లయ్యింది.
రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తరువాత కూడా క్రికెట్ ను పక్కన పెట్టలేదు. దాదాపు ఆరేళ్లకాలంగా ఎంతోమంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీస్తున్నారు. ఐపీఎల్, టీట్వంటీ, భారత జట్టులో చోటు సంపాదించిన వారిలో చాలా మంది రాహుల్ ద్రావిడ్ వద్ద శిక్షణ పొందినవారే కావడం విశేషం. రాహుల్ ద్రావిడ్ టీమిండియాలో కీలక ఆటగాడు. మిస్టర్ కూల్ గా పేరున్న వ్యక్తి. అందరికీ సుపరిచితుడు. ఈ క్రమంలో టీమిండియాకు కోచ్ గా రాహుల్ ద్రావిడ్ రావడం మంచి పరిణామం. ద్రావిడ్ ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే టీమిండియా కోచ్ గా రావాలని బీసీసీఐ కోరగా.. తిరస్కరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఎన్సీఏ బాధ్యతలు నిర్వహిస్తాడా? టీమిండియా కోచ్ గా వస్తాడా అన్న సందిగ్దం ఉండగా.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా కలిసి ద్రావిడ్ ను ఒప్పించారు. దీంతో పెద్ద ఉత్కంఠకు తెరపడగా.. త్వరలోనే ద్రావిడ్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు.
ప్రస్తుత కోచ్ రవిశాస్ర్తీ పదవీకాలం మరో నాలుగు నెలలు ఉంది. టీ 20 ప్రపంచ కప్ తరువాత రవిశాస్త్రీ తప్పుకోనున్నారు. అయితే రాహుల్ ద్రావిడ్ విషయంలో గంగూలీ ఫుల్ కేర్ తీసుకున్నారు. తన సహచరుడు టీమిండియా కోచ్ గా వస్తే.. జట్టుకు కూర్పు బాగుంటుందని భావించాడు. వచ్చే ప్రపంచకప్ లక్ష్యంగా టీంను తయారు చేస్తాడనే నమ్మకం గంగూలీలో ఉండడంతో ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేశాడు. 2023 ప్రపంచకప్ వరకు ద్రావిడ్ కోచ్ గా కొనసాగుతాడు. ఈ క్రమంలో స్వదేశీ శిక్షకుడి సారథ్యంలో టీమిండియా మంచి ఆటను కనబరుస్తుందని అంతా అనుకుంటున్నారు. దీంతో పాటు కోహ్లీ, రోహిత్ వంటి సూపర్ ఆటగాళ్లకు ద్రావిడ్ కోచ్ గా ఉండడం కలిసివస్తుందని చాలా మంది క్రీడాభిమానులు అంటున్నారు. అయితే టీమిండియా కోచ్ పదవికోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా.. ద్రావిడ్ ఎంపిక లాంఛనమైపోయింది.