Somesh Kumar : హైకోర్టు చీవాట్లు పెట్టడంతో మొత్తానికి ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ కు తప్ప లేదు. చివరికి తప్పుకున్నారు. ఇన్నాళ్ళు ప్రగతి భవన్ పై ఎనలేని విశ్వాసం చూపినా.. కేసీఆర్ కనుకరించలేదు. కెసిఆర్ తీరు అలానే ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు సోమేశ్ కుమార్ కు తత్వం బోధపడి ఉంటుంది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమేశ్ ప్లేసులో శాంతి కుమారి వచ్చింది. కానీ ఇప్పుడు సోమేష్ కుమార్ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.. టీచర్లు సోమేష్ కుమార్ తప్పుకున్నాక ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు.

-ఏం జరిగిందంటే
అప్పట్లో టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ 317 జీవో తీసుకొచ్చారు.. దీనివల్ల టీచర్లను అడ్డగోలుగా బదిలీ చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది టీచర్లు ఈ జీవో వల్ల ఇబ్బంది పడ్డారు. పది మంది దాకా ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అర్థాంతరంగా ఉన్న చోటు నుంచి బదిలీ కావడంతో టీచర్లు చాలా అవస్థలు పడ్డారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు.
-సీఎస్ పై ఆగ్రహం
అప్పట్లో ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు సీఎస్ సోమేశ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు.. ఈ జీవోపై ముందుకే వెళ్లారు. ఇక క్యాడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇన్నాళ్లు పనిచేశారు.. దీనిపై మంగళవారం హైకోర్టు చివాట్లు పెట్టింది.. ఆ పదవిలో మీరు ఎలా కొనసాగుతారు అంటూ దుయ్యబట్టింది.. దీంతో ఆయన తప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే ఆయన తన కేడర్ రాష్ట్రానికి బదిలీ కాక తప్పలేదు. దీనిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-కర్మ సిద్ధాంతం ఇలానే ఉంటుంది
సోమేశ్ కుమార్ తప్పుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన తానిపర్తి తిరుపతిరావు అనే ఉపాధ్యాయుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ” సోమేశ్ గారు మీరు బదిలీ అయినందుకు బాధగా ఉంది.. మీకు ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో తెలుస్తుంది.. 317 జీవోతో మమ్మల్ని ఉన్నట్టుండి బదిలీ చేశారు. మా కుటుంబాలకు దూరం చేశారు.. మా ఊరికి దూరం చేశారు. ఉద్యోగుల విభజన ఇలా కాదు… సర్వీస్ పుస్తకంలో ఉన్న విధంగా స్థానికత పరిశీలించండి అని అడిగితే కేడర్ సీనియారిటీ అని ప్రశ్నించారు.. అలానే అయితే ఫీడర్ కేడర్ కూడా లెక్కించాలని కోరాం. దానికి న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పారు.. చివరకు న్యాయం కోసం కోర్టుకు వెళ్ళాం.. అప్పుడు కోర్టు మాకు ఏ తీర్పు ఇచ్చిందో… ఇప్పుడు మీకు కూడా అలాంటి తీర్పు ఇచ్చింది.. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు.. మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. అలా చేస్తే మనకు కూడా అలాంటి గతే పడుతుంది.. 317 జీవో వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. మీరు పెద్ద ఉద్యోగులు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా పెద్ద బంగ్లా ఇస్తారు. మీరు హాయిగా అందులో కాపురం పెట్టొచ్చు.. కానీ మా పరిస్థితి అలా కాదు కదా? జిల్లాలకు బదిలీ చేసి, అక్కడి దగ్గర పోస్టులను బ్లాక్ చేశారు. మొదట్లో దీనిపై చాలా ఇబ్బంది పడ్డాం.. తర్వాత సర్దుకుపోయాం.. ఇప్పుడు మిమ్మల్ని హైకోర్టు బదిలీ చేయడం పట్ల మాకు ఏమాత్రం సంతోషం లేదు.. సాటి ఉద్యోగిగా నా సానుభూతి. తెలంగాణలో చేసినట్టు ఆ రాష్ట్రానికి వెళ్లి లేనిపోని సలహాలు ఇవ్వకండి. ఆ రాష్ట్ర ఉద్యోగుల గోసపుచ్చుకోకండి” అంటూ రాసుకు వచ్చాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.