Homeఆంధ్రప్రదేశ్‌జనసేనతో పొత్తుకు టీడీపీ ఆరాటం.. లేదంటే గెలుపు కష్టమని తమ్ముళ్ల పోరాటం

జనసేనతో పొత్తుకు టీడీపీ ఆరాటం.. లేదంటే గెలుపు కష్టమని తమ్ముళ్ల పోరాటం

TDP
గత 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఓడిందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి అంత పెద్ద ఓటమి చూడలేదు. టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద పరాజయం. అంతేకాదు.. అప్పటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి భంగపాటు తప్పడం లేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేపట్టాక ప్రతీ ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో జతకట్టారు. పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఏనాడూ బరిలోకి దిగలేదు. సొంతంగా పోటీ చేసిన ప్రతీసారి ఆయ‌న‌కు ఎదురు దెబ్బలే తగిలాయి.

Also Read: భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ..రిపోర్టర్లకు కత్తిపోట్లు.. బండి సంజయ్ ఫైర్

1999లో బీజేపీతో పొత్తు, కార్గిల్ వార్ సానుభూతి ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. ఇక 2014లో బీజేపీతో పొత్తు, మోడీ వేవ్, ప‌వ‌న్ మ‌ద్దతు క‌లిసొచ్చాయి. 2004లో బీజేపీ పొత్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో 47 సీట్లే వ‌చ్చాయి. 2009లో నాలుగు పార్టీల పొత్తు ఉన్నా 92 సీట్లే వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తే 23 సీట్లే వ‌చ్చాయి. ఒంట‌రి పోరుతో ముందుకు వెళ్లిన 1999 లోక్‌స‌భ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లోనూ చంద్రబాబుకు షాక్ త‌ప్పలేదు. 2009లో ప్రజారాజ్యం 18 శాతం ఓట్లు చీల్చి చంద్రబాబును వ‌రుస‌గా రెండోసారి ప్రతిప‌క్షంలో కూర్చోపెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు ధీమా మీద ఉన్న చంద్రబాబుకు మ‌రోసారి జ‌న‌సేన దెబ్బకొట్టింది. చంద్రబాబు ప్రతిప‌క్షంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతున్న స‌మ‌యంలో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌లు టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌ను పూర్తిగా మార్చేశాయి.

ఏపీలో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ దూకుడు ముందు టీడీపీ పూర్తిగా బేజారయిపోయింది. పార్టీలో ఎవ‌రు ఎప్పుడు ఉంటారో తెలియ‌డం లేదు. పార్టీ నాయ‌కులు, కేడ‌ర్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన స‌మ‌యంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యక‌ర ఫ‌లితాలు వ‌చ్చాయి. అధికార వైసీపీని ఎదుర్కోలేని చోట్ల చాలా మంది ముందుగా చేతులు ఎత్తేశారు. అయితే.. కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జీలు మాత్రం తెలివిగా జ‌న‌సేన‌తో పొత్తులు, స‌ర్దుబాట్లు చేసుకున్నారు.

తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలిచిన రాజోలులో ఎమ్మెల్యే రాపాక పార్టీ మారినా జ‌నసేన, టీడీపీ పొత్తు వల్ల రెండు పార్టీలు వైసీపీతో పోటీగా పంచాయ‌తీలు గెలుచుకున్నాయి. ఆ ఒక్క చోటే కాదు అదే కోన‌సీమ‌లో అమ‌లాపురం, టి.గ‌న్నవ‌రం, కొత్తపేట నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ముమ్మడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌న‌సేన, టీడీపీ అంత‌ర్గత ఒప్పందాలు అధికార పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాయి. పి.గ‌న్నవ‌రం నియోజ‌క‌వర్గంలో మండ‌ల కేంద్రాలు, మేజ‌ర్ పంచాతీలు జ‌న‌సేన–టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ రెండు పార్టీల దెబ్బతో విల‌విల్లాడారు. మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో కూడా జ‌నసేన – టీడీపీ పొత్తు ఉన్న చోట అధికార పార్టీ అభ్యర్థులు ఓడారు. కొత్తపేట‌లో మండ‌ల కేంద్రాలు అయిన ఆత్రేయ‌పురం, కొత్తపేట‌, ప‌లివెల‌లో టీడీపీ విన్ అయ్యింది. ఇటు ప‌శ్చిమ‌లోనూ న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం, ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌నసేన –టీడీపీ పొత్తు ఉన్న పంచాయ‌తీల్లో రెండు పార్టీలు ల‌బ్ధి పొందాయి. తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన ఎక్కువ పంచాయ‌తీల్లో పాగా వేయ‌డం వెన‌క ఇదే ప్రధాన కార‌ణం.

Also Read: బ్రేకింగ్: టీడీపీ యువనేత మృతి.. టీడీపీలో తీవ్ర విషాదం

తాడేప‌ల్లిగూడెంలో ఇన్‌చార్జిగా వ‌చ్చిన టీడీపీ నేత వ‌ల‌వ‌ల బాబ్జీ ముందే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు పార్టీల పొత్తు ఫ‌లితాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే ఇలా ప్రయ‌త్నించి స‌క్సెస్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే స‌క్సెస్ అవుతామ‌ని.. లేక‌పోతే భ‌విష్యత్తులోనే క‌ష్టమే అన్న విష‌యంపై పార్టీ అధిష్టానానికి నివేదిక‌లు పంపారు. మరి ఈ పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version