https://oktelugu.com/

తిరుపతి వ్యయం: బీజేపీ బలంగా.. టీడీపీకి కష్టంగా..

ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల.. పాలన పట్ల ఎంత సానుకూలత ఉన్నా ఖర్చు పెట్టక తప్పదు. ఇప్పుడు ఏపీలో తిరుపతి సీటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక కాస్త తెలుగుదేశం పార్టీ కొత్త సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు – అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు – ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో ఢీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కల్యాణ్ […]

Written By: , Updated On : March 30, 2021 / 11:10 AM IST
Follow us on

TDP vs BJP
ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల.. పాలన పట్ల ఎంత సానుకూలత ఉన్నా ఖర్చు పెట్టక తప్పదు. ఇప్పుడు ఏపీలో తిరుపతి సీటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక కాస్త తెలుగుదేశం పార్టీ కొత్త సమస్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు – అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు – ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీని ఏకకాలంలో ఢీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తోడుగా బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారపర్వంలో సై అంటే సై అనే రేంజ్‌లో దూసుకెళ్తుండగా.. టీడీపీ వెనుకంజలో ఉంటోందనే అభిప్రాయం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఉంది.

దీనికితోడు ఈ ఉప ఎన్నిక ప్రచార ఖర్చును భరించడానికి పేరున్న నేతలెవరూ పెద్దగా ఆసక్తిగా చూపట్లేదని అంటున్నారు. ఇదివరకు ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా, నిధులను మంచినీళ్లలా ఖర్చు పెట్టగలిగే ఆర్థిక స్థోమత టీడీపీలో కనిపించేది. ధారాళంగా ఎన్నికల ఖర్చును భరించే నేతలెవరైనా ఉన్నారంటే.. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీమంత్రి నారాయణ, తెలంగాణకు చెందిన నామా నాగేశ్వర రావు, కంభంపాటి రామ్మోహన్ రావు వంటి నేతల పేర్లు ఠక్కున గుర్తుకొచ్చేవి.

బడా కాంట్రాక్టర్లుగా పేరున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్‌ ఇచ్చేవారు. రాజ్యసభ సీటు కోసం టీజీ వెంకటేష్.. టీడీపీకి వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్‌ ఇచ్చారంటూ ఇదివరకు వార్తలు సైతం వచ్చాయి. ప్రస్తుతం ఆ నాయకులందరూ బీజేపీలో ఉన్నారు. 2019 నాటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన అతి కొద్దిరోజుల్లోనే వారంతా పార్టీ ఫిరాయించారు. మూకుమ్మడిగా కాషాయ కండువా కప్పుకొన్నారు. అయినప్పటికీ- బీజేపీలో కొనసాగుతూ టీడీపీ గళాన్ని వినిపిస్తున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.

ఫలితంగా ఇప్పుడు టీడీపీ నిధుల కొరతను ఎదుర్కొంటోందనే వాదనలు జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార ఖర్చును ఎవరు భరించాలనే ప్రశ్న తలెత్తుతోంది. తిరుపతికి ఆనుకునే ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణ కుమారి కుటుంబం ఈ ఉప ఎన్నిక పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదట. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ స్థానం లేకపోవడం.. గల్లా జయదేవ్ గుంటూరుకు ప్రాతినిథ్యం వహిస్తుండం వంటి కారణాలతో ఆ కుటుంబం ఉప ఎన్నిక ఖర్చును భరించడానికి ముందుకు రావట్లేదని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గెలుపోటముల మాట అలా ఉంచితే.. అసలు ఈ ఉప ఎన్నిక ఖర్చును తాము సైతం భరించలేమంటూ గల్లా కుటుంబం చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీటును కూడా ఈ రూపంలో కోల్పోయే ప్రమాదాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.