Pawan Kalyan Varahi Yatra: తెలుగుదేశం,జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైంది.పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు.అందుకు తగ్గట్టుగానే నాదేండ్ల మనోహర్,మెగా బ్రదర్ నాగబాబు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. గ్రౌండ్ లెవెల్ లో రెండు పార్టీల మధ్య సమన్వయం చేసుకునేందుకు వీలుగా జనసేన పార్టీ శ్రేణులను అలెర్ట్ చేశారు.జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు.పొత్తుపైఅధినేత నిర్ణయం ఫైనల్ అని..టిడిపితో సమన్వయం చేసుకోవాలని నాగబాబు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. పార్టీ శ్రేణులు పొత్తులపై ప్రతికూలత చూపేలా ప్రకటనలు వద్దని హెచ్చరించారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ సైతం స్పష్టమైన ప్రకటన జారీ చేసింది.చంద్రబాబు అరెస్టు అయిన నంద్యాలలో తెలుగుదేశం పార్టీ యాక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. కీలక రాజకీయ పరిణామాలపై చర్చించింది.చంద్రబాబు అరెస్టుతోపాటు జనసేనతో సమన్వయం ఎలా చేసుకోవాలి అన్న అంశంపై చర్చించింది.రేపటి నుంచి జరగబోయే పవన్ వారాహి యాత్రలోతెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు అంకాన్ని గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకెళ్లే ఒక కీలక ఘట్టంగా వారాహి యాత్ర నిలుస్తుందని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు నైరాస్యంలోకి వెళ్లిపోయాయి. కేవలం నిరసన ఆందోళన కార్యక్రమాలతో టిడిపి శ్రేణులు గడుపుతున్నాయి. మరోవైపు లోకేష్ సైతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన చేపట్టాల్సిన యువగళం పాదయాత్ర సైతం వాయిదా పడింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి అయోమయంలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ వారాహి యాత్రతో వైసిపి సర్కార్ పై స్ట్రాంగ్ వాయిస్ వినిపించేందుకు సిద్ధపడుతున్నారు.
సాధారణంగా పవన్ వారాహి యాత్ర అంటేనే జనయాత్ర. ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతారు. ఆ జనాన్ని ఉద్దేశించి పవన్ పదునైన వస్త్రాలతో వైసిపి సర్కార్ పై విరుచుకుపడతారు. ఇప్పుడు వారాహి యాత్రకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరుకానుండడంతో అదనపు ఆకర్షణగా నిలవనుంది. పవన్ యాత్రలో అటు జనసేన, ఇటు టిడిపి జెండాలు రెపరెపలాడనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నిస్తేజంతో ఉన్న టిడిపి శ్రేణులకు పవన్ వారాహి యాత్ర ఉపశమనం కలిగించనుంది. ఇప్పటికే పవన్ నుంచి పొత్తు ప్రకటన రావడంతో రెండు పార్టీల మధ్య సహృద్భావం నెలకొనడానికి వారాహి యాత్ర ఎంతగానో దోహదపడుతుందనివిశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే రెండు పార్టీల శ్రేణులతో పవన్ చేపట్టబోయే వారాహి యాత్ర సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయం అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీకి సరికొత్త రాజకీయ హెచ్చరికలు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.