TDP Twitter Hacked: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది టీడీపీ పరిస్థితి. నిత్యం టెక్నాలజీ అనే మాట వల్లించే ఆ పార్టీకి కూడా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిత్యం హైటెక్ జపాన్ని పఠించే చంద్రబాబు కూడా వాటని నియంత్రించ లేకపోతున్నారు. టెక్నాలజీతో రూపొందించిన ఉంగరం ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న చంద్రబాబు పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కాకుండా కాపాడుకోలేకపోతున్నారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా రెండు సార్లు హ్యక్ కు గురైంది. గతంలో ఓ సారి హ్యాక్ కు గురికాగా.. అది వైసీపీ నేతల పనేనంటూ ఆరోపించి సరిపెట్టుకున్నారు. అప్పట్లో హ్యాక్ కు గురైన ఖాతా ద్వారా అసభ్యపదజాలాలతో పోస్టింగులు పెట్టారు. ఈసారి మాత్రం అటువంటిదేమీ లేకపోయినా.. తొలిసారి హ్యాక్ గురైనా టీడీపీ జాగ్రత్త పడకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ సోషల్ మీడియా విభాగం డొల్లతనం బయటపడింది.

ప్రస్తుతం అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగ్ లు ఉన్నాయి. సోషల్ మీడియా వారియర్ పేరిట సేవలందిస్తున్నాయి. అటు వైసీపీకి దీటుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని తీర్చిదిద్దారు. చింతకాయల విజయ్ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ సోషల్ మీడియా బాగానే పనిచేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. టీడీపీతో పోలిస్తే వైసీపీ సోషల్ మీడియా వెనుకబడిందన్న ప్రచారమైతే ఉంది. ఈ నేపథ్యంలో మేల్కొన్న సీఎం జగన్ సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు భరత్ రెడ్డికి =ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురికావడంతో అది సోషల్ మీడియా విభాగం వైఫల్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

వాస్తవానికి ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా కూడా ఓ సారి హ్యాక్ కు గురైంది. క్రిఫ్టో కరెన్సీకి అనుమతులిస్తున్నట్టు ప్రధాని ట్విట్టర్ ద్వారా పోస్టుచేశారు. అయితే దానిని నిఘా విభాగం గుర్తించి నియంత్రించగలిగింది. ప్రధాని ట్విట్టర్ ఖాతాకే లెక్కలేదంటే… టీడీపీఖాతా ఒక లెక్క అనుకుంటే పొరబడినట్టే.ఎవరి ఖాతా అయినా సెక్యూరిటీ ఫీచర్స్ గట్టిగా పెట్టుకుంటే వీలైనంత వరకూ ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ కు గురికాకుండా చూడొచ్చు. అంటే టీడీపీ ట్విట్టర్ ఖాతాకు హై సెక్యూరిటీ ఫీచర్స్ వాడలేదన్న మాట. ఇప్పటికైనా టీడీపీ సోషల్ మీడియా విభాగం జాగ్రత్తపడాల్సిన అవసరముంది. పెగాసన్ తో పాటు దానికి వంద రెట్లు సామర్థ్యమున్న నిఘా వ్యవస్థలను అన్ని రాజకీయ పార్టీలు వినియోగిస్తున్నాయి. ఈ నిఘా వ్యవస్థలతో ప్రత్యర్థుల హ్యాక్ చేయడం ఏమంత కష్టమైన పనికాదు. కానీ వాటి రక్షణకు కూడా అదే స్థాయిలో రాజకీయ పార్టీలు గట్టి చర్యలే తీసుకోవాలి. లేకుంటే ఇప్పటివరకూ ట్విట్టర్ ఖాతాలే.. రేపు బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసేవారి అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజా పరిస్థితులతో చంద్రబాబు మేల్కొంటే మంచిది. లేకుంటే టీడీపీ రహస్యాలు ప్రత్యర్థులకు చేరేఅవకాశముంది.