Modi Brand Value: ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. మనదేశంలోనే ఉంటూ స్వీడన్ దేశంలో కారు నడపగలిగే స్థాయికి ఎదిగాం. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడుగానే రకరకాల అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేశాయి. కాదు ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నాయి. కొరకరాని కొయ్యగా ఉన్న విశ్వం పుట్టుక నుంచి.. ఆరవ సముద్రం ఆనవాళ్లు కనిపెట్టే దాకా ఇవి మన అడుగులను మరింత వేగవంతం చేస్తున్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే ముందుగానే చెప్పుకున్నట్టు మనం సాంకేతిక యుగంలో ఉన్నాం. ఈ సాంకేతిక యుగం మనకు అందించిన ఫలాలే సామాజిక మాధ్యమాలు, మైక్రో బ్లాగింగ్ సైట్లు. వీటి వాడకం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. వీటి ఆధారంగానే లక్షల కోట్లల్లో వ్యాపారం సాగుతోంది. వీటి వాడకం సరే ఇందులో బహుళ ప్రజాదరణ పొందిన వాళ్లు ఎవరు? ఇంతకీ వారి విలువ ఎంత? దీనిపై చెక్ బ్రాండ్ అనే సంస్థ ఈమధ్య ఒక విశ్లేషణ చేపట్టింది. అందులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ ఒక క్రికెటర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఇంతకీ ఏమిటి ఆ కథా కమామీసు అంటే.

డిజిటల్ ప్రపంచంలో మోడీ బ్రాండ్ ఇమేజ్ 413 కోట్లు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో ప్రపంచాధినేతల్లో మోదీ తర్వాతే ఎవరైనా. వీటిని ఆధారంగా చేసుకునే 2019 ఎన్నికల్లో డిజిటల్ ప్రచారానికి నాంది పలికారు. ఈ దేశ చరిత్రలో 29 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో డిజిటల్ ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కాబోలు. దాదాపు అన్ని దిగ్గజ సామాజిక మాధ్యమాలు, మైక్రో బ్లాగింగ్ సైట్లల్లో ప్రధానమంత్రి మోడీకి ఖాతాలు ఉన్నాయి. వీటి అన్నింటిలోనూ ఆయన ముందంజలో ఉన్నారు. అనుసరించే వారి జాబితాలో ప్రపంచ నేతలనూ ఆయన అధిగమించారు. తాజాగా ఆయన మరో రికార్డు సాధించారు. భారత రాజకీయ నాయకుల విభాగంలో డిజిటల్ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ రికార్డును సృష్టించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, వికీపీడియా, గూగుల్ ట్రెండ్స్, గూగుల్ సెర్చ్ తదితర సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకులు, ప్రముఖ బ్రాండ్లు, సినీ తారలు, క్రికెటర్ల ఉనికి, అనుసరించే వారి ప్రతి స్పందనలను అనాలసిస్ అండ్ డిజిటల్ ర్యాంకింగ్ సంస్థ చెక్ బ్రాండ్ విశ్లేషించింది. వారి బ్రాండ్ ఇమేజ్ లను లెక్క కట్టింది. ఇందుకోసం 10 కోట్లకు పైగా ఆన్లైన్ ఇంప్రెషన్లను విశ్లేషించింది. 500 మంది రాజకీయ నాయకుల ప్రొఫైల్స్ ను జల్లెడ పట్టి.. వారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను అంచనా వేసింది. ఇలా ప్రధానమంత్రి మోడీ బ్రాండ్ ఇమేజ్ విలువ 413 కోట్లు అని వెల్లడించింది. ఏ డి జి ఆన్లైన్, చెక్ బ్రాండ్ సంస్థల ఎండి అనూజ్ సయాల్ శనివారం ఈ జాబితాను విడుదల చేశారు.
ఆ కార్యక్రమంతో మోడీ బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగింది
హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ తో మోదీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాగా చెక్ బ్రాండ్ చివరిసారిగా 2020లో బ్రాండ్ విలువల జాబితాను విడుదల చేసింది. అప్పట్లో ప్రధానమంత్రి మోడీ బ్రాండ్ విలువ 327 కోట్లు మాత్రమే. సాగులో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రూపొందించిన చట్టాల వల్ల ఆ బ్రాండ్ విలువపై ప్రతికూల ప్రభావం కనిపించింది.ఆ తర్వాత హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ద్వారా ఆయన బ్రాండ్ విలువ ఒకసారిగా పెరిగింది. అన్ని బ్రాండ్లు, వ్యక్తుల జాబితాలో ప్రధానమంత్రి మోడీ నాలుగవ స్థానంలో నిలిచారు. ఆయనకంటే ముందు వరుసలో ప్రముఖ బ్రాండెడ్ వస్త్రాల తయారీ సంస్థ నైకీ/ నైక్ , సామ్ సంగ్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు.
రాజకీయ నాయకుల విభాగంలో
మనదేశంలో రాజకీయాల గురించి ప్రజలకు ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆసక్తిని గమనించే చెక్ బ్రాండ్ రాజకీయ నాయకులకు ఉన్న బ్రాండ్ విలువను లెక్క కట్టింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి అమిత్ షా 96.8 కోట్ల బ్రాండ్ విలువ పొందారు. అరవింద్ కేజ్రీవాల్ 61.7 కోట్ల బ్రాండ్ విలువ పొందారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ ఈ జాబితాలో చాలా వెనుకబడి ఉన్నారు. అమిత్ షా హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా తన బ్రాండ్ విలువను పెంచుకున్నారని చెక్ బ్రాండ్ సంస్థ తెలిపింది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ ను ఎత్తివేయడం ద్వారా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ స్కీం ద్వారా కొంత బ్రాండ్ విలువ తగ్గినా.. తర్వాత ఆయన పుంజుకున్నారు.

ఢిల్లీలో ప్రచారంజక పాలన చేస్తున్న అరవింద్ కేజ్రివాల్ బ్రాండ్ విలువను పెంచుకున్నారు. అయితే ఢిల్లీలో లిక్కర్స్ స్కాం లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు వినపడుతున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీ వాల్ ను అనుసరించే వారి సంఖ్య తగ్గిపోయింది. లేకుంటే అమిత్ షాకు ఆయనకు కొద్ది తేడా మాత్రమే ఉండేది. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని చాలామంది నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను కూడా నెటిజన్లు పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. దేశం ఇప్పుడు ఐదవ తరం టెలికాం సేవలు ప్రారంభించే స్థాయికి ఎదిగిందని, అదే యూపీఏ ప్రభుత్వం ఉండి ఉంటే 2జి కూడా కానా కష్టంగా వచ్చేదని ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర రావు లేనే లేరు. వారి నాయకత్వంపై తమకు నమ్మకం లేదని చాలామంది నెటజన్లు అభిప్రాయపడ్డారు. ఇక త్వరలో జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో చెక్ బ్రాండ్ సంస్థ నిర్వహించిన సర్వే ఒకరకంగా ఆ పార్టీకి అశని పాతం లాంటిదే!