TDP MLAs: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసంతో కూడుకున్న పనే. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపేందుకు ఏ వేదికను విడిచిపెట్టకూడదన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మొగ్గుచూపింది. వాస్తవానికి ఈ సమావేశాలను టిడిపి బహిష్కరిస్తుందని వైసీపీ భావించింది. కానీ టిడిపి అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అన్నింటికి తెగించే టిడిపి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సాధారణంగా వైసిపి అటాక్ ఎలా ఉంటుందో టిడిపికి తెలుసు. 2014, 19 మధ్య టిడిపి అధికారంలో ఉన్నప్పుడే.. వైసీపీ ఎమ్మెల్యేలు తాము ఏంటో చూపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. చివరకు చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యేంతగా వైసీపీ సభ్యులు వెంటాడారు. ఇప్పుడు చంద్రబాబు తాజా అరెస్ట్ నేపథ్యంలో ఊరుకుంటారని అనుకుంటే మనం పొరబడినట్టే. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుతో వైసిపి నేతల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో టిడిపి ఎమ్మెల్యేలు కనిపిస్తే ఏ స్థాయిలో విరుచుకుపడతారో ఊహించుకోవాల్సిందే.
శాసనసభ సమావేశాలకు టీడీపీ హాజరు కావాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. లేకుంటే శాసనసభలో ప్రశ్నించే వారే ఉండరు. సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్ లు అవినీతిపరులని.. అందుకే వారిని అరెస్టు చేస్తున్నామంటూ శాసనసభ సాక్షిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా శాసనసభ సమావేశాలకు హాజరైంది. కానీ సభలో ఉన్నంత సేపు ఎన్నెన్నో అవమానాలు భరించాల్సి ఉంటుంది. అయినా సరే టిడిపి ఎమ్మెల్యేలు అందుకు సిద్ధపడ్డారంటే చంద్రబాబు అరెస్టును ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.