Telangana tdp : తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకునే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. టిడిపి హై కమాండ్ సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంలో టిడిపి గత కొద్దిరోజులుగా ఊగిసలాటలో ఉంది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేయకపోవడం శ్రేయస్కరమని భావిస్తోంది. తనపై మోపిన కేసులపై పోరాడుతున్న తరుణంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శనివారం టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం ములాఖత్ లో చంద్రబాబును కలిశారు. తెలంగాణలో పోటీ విషయమై చర్చించారు. తెలంగాణ ఎన్నికల్లో తాము బరిలో నిలవాలని కోరుకుంటున్నామని జ్ఞానేశ్వర్ చంద్రబాబుకు వివరించారు. పోటీకి అనుమతించాలని కోరారు.దీనిపై చంద్రబాబు స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్ పెట్టలేమని.. దిగితే పూర్తిస్థాయిలో యుద్ధం చేయాల్సి ఉంటుందని… ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా మీరంతా చూస్తున్నారని.. అందుకే వెనక్కి తగ్గడం మేలని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ కు సముదాయించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ కు ముందు తెలంగాణలో సైతం టిడిపి కార్యక్రమాలు పెరిగాయి. ఖమ్మం తో పాటు హైదరాబాదులో టిడిపి సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను యాక్టివ్ చేశారు. ఇంతలో చంద్రబాబు అరెస్టు జరిగింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గత 50 రోజులుగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కంటే.. పోటీకి దూరంగా ఉండటమే మేలని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణలో పోటీ విరమణ వెనుక బిజెపి ఒత్తిడి ఉందోనన్న చర్చ అయితే ఒకటి జరుగుతోంది. మొన్నటికి మొన్న లోకేష్ అమిత్ షా ను కలిసిన తర్వాతే.. తెలంగాణలో టిడిపి యాక్టివిటీస్ తగ్గిపోయాయి.కానీ పోటీపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి 100 మంది అభ్యర్థులను తయారు చేశారు. అయితే చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల తర్వాత సీన్ మారింది.
అయితే తెలంగాణలో టిడిపి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం వరకు ఓకే కానీ.. ఆ పార్టీ ఎవరికైనా బాహటంగా మద్దతు తెలుపుతోందా? లేకుంటే స్పష్టమైన ప్రకటన చేస్తుందా? లేకుంటే లోపాయికారిగా సపోర్ట్ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది టిడిపి వ్యూహం. అదే సమయంలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్టుపై కేంద్ర పెద్దలు సహకరిస్తే.. తెలంగాణలో ఆ పార్టీకి మద్దతు తెలిపే అంశంపై టిడిపి ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏపీ పరిస్థితులు దృష్ట్యా తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గం, సెటిలర్స్ బిజెపి పై అనుమానపు చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.