చొక్కా చిరుగు పడితే.. వెంటనే దానికి కుట్టు వేయాలి. అలా చేయకుండా వదిలేస్తే.. చాటంతై చాపంత అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఇప్పుడు ఇదే సమస్య ఎదుర్కొంటోంది. అక్కడ పసుపు చొక్కాకు చిల్లు పడి ఏడాదిన్నర దాటింది. కానీ.. అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికీ దానికి టాకా వేయట్లేదు. ఫలితంగా చిరుగు పెద్దదవుతూ వస్తోంది.
Also Read: పవన్.. నీకిది తగునా?
ఆ రెండు చోట్ల..
తూ.గో. జిల్లాలోని రామచంద్రాపురం.. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీకి సరైన నేతలు లేరు. ఎన్నికల వేళ.. పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన అభ్యర్థులు సైకిల్ దిగేశారు. చొక్కాలు మార్చేశారు. అప్పటి నుంచి అక్కడ పార్టీని నడిపించే నేతలు కరువయ్యారు. ఏడాదిన్నర కాలం గడిచింది. అయినా కానీ.. సరైన నాయకుడు దొరికినట్టు లేరు!
ఆ తమ్ముడు వెళ్లిపోయాడు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముడు తోట త్రిమూర్తులు పార్టీని వదిలేశారు. అధికార పార్టీ తీర్థం తీసుకున్న ఆయన.. పక్క నియోజకవర్గమైన మండపేటకు కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం సమయంలోనే సైకిల్ దిగేసిన ఆయన.. తర్వాత వచ్చి మళ్లీ సైకిల్ ఎక్కారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి సైకిల్ దిగేసి తన దారిన తాను వెళ్లిపోయారు. ఫలితంగా.. కేడర్ బలంగానే ఉన్నా.. సరైన నాయకత్వం లేకపోవడంతో తెలుగుతమ్ముళ్లకు దశ, దిశ చూపించేవారు కరువయ్యారు.
Also Read: పోలవరం బడ్జెట్లో కేంద్రం వాటా తేలేనా?
స్థానిక ఎన్నికల వేళ..
ఓ పక్క స్థానిక ఎన్నికల కోసం కసరత్తు జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని నడిపే నాయకత్వం లేకపోవటం నష్టమే. అయినా కూడా పార్టీ అధినాయకత్వం ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అంతర్గత అంశాల్ని పట్టించుకునేంత తీరిక ఉండదు. కానీ.. విపక్షంలో ఉన్నప్పుడు కావాల్సినంత సమయం దొరుకుతుంది. జిల్లాల వారీగా పార్టీని పటిష్టం చేసుకోవడానికి, సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా అధినేత బాబు ఎందుకు ఈ సమస్యను వాయిదా వేస్తున్నారో అర్థం కావట్లేదంటున్నారు అక్కడి తమ్ముళ్లు.
త్వరగా సెట్ చేస్తేనే..
ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకొని త్వరగా సెట్ చేస్తేనే మంచిది. నాయకత్వాన్ని ఎంపిక చేయడం ద్వారా పార్టీ కేడర్ లో జోష్ పెంచేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే.. కేడర్ లో నిరాశ అలవడితే పార్టీకి ఇబ్బందులు తప్పవు. మరి, బాబు ఈ విషయాన్ని ఎప్పుడు పరిగణనలోకి తీసుకుంటారో..?
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్