TDP: ప్రధాని మోడీపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలు త్యాగం చేస్తే.. కనీసం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక్క ప్రకటన చేయలేదు. చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు. అటు సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఇలా అయితే పూర్తి ఎందుకని ప్రశ్నిస్తున్న వారు అధికమవుతున్నారు. కొందరైతే సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ తీరును తప్పుపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులైన సీఎంలపై విమర్శలు సంధించే ప్రధాని మోదీ.. ఏపీ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టిడిపి శ్రేణులు పెడుతున్న పోస్టులు ఇప్పుడు చర్చకు కారణం అవుతున్నాయి.
చిలకలూరిపేట సభలో ప్రధాని నోటి నుంచి తాము కోరుకున్న మాటలు వస్తాయని తెలుగుదేశం పార్టీ భావించింది. అమరావతి రాజధానిపై, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని భావిస్తారని ఊహించారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పు పడతారని.. గత ఐదు సంవత్సరాలుగా జగన్ పాలనలో వైఫల్యం చెందారని.. మళ్లీ చంద్రబాబు వస్తేనే పాలన గాడిలో పడుతుందని.. మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితం అని.. ఇలా ప్రధాని ఆరోపణలు చేస్తారని భావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నోటి వెంబడి వచ్చే మాటలు.. ప్రధాని నుంచి సైతం ఆశించారు. అవి జరగకపోయేసరికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన, అనుమానం ప్రారంభమైంది. ఇప్పటికీ జగన్ ను అభిమానిస్తున్నారన్న అనుమానం వెంటాడుతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు భిన్నంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ పై, తమిళనాడులో స్టాలిన్ పై, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పై, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని చేసే ఆరోపణలు గుర్తుచేస్తూ.. ఆ స్థాయిలో ఏపీలో ఎందుకు విమర్శలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలా విమర్శలు చేస్తే సింహభాగం ప్రయోజనాలు టిడిపికి దక్కుతాయని తెలిసి ప్రధాని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తప్పుపడుతున్నారు. దీనిపై బిజెపి శ్రేణులు, మోడీ అభిమానులు స్పందిస్తున్నారు. దీంతో వారి మధ్య రచ్చ జరుగుతోంది. మున్ముందు ఇది ఇలానే కొనసాగితే పొత్తు ధర్మం విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.