రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారవుతోంది. జగన్ దూకుడు ముందు ఆ పార్టీ నిలవలేకపోతోందనే అభిప్రాయం ఓ వైపు వ్యక్తమవుతుండగా.. మరోవైపు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. లోకేష్ నాయకత్వాన్ని నిరాకరిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాబోయే ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు ఈ పరిస్థితి పీక్ స్టేజ్ కు చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలువురు తమ్ముళ్లు అయితే.. చంద్రబాబు స్టార్ కూడా తగ్గిపోయిందని, ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఆఫ్ ది రికార్డు చెబుతున్నారట. అటు లోకేష్ ను లెక్కలోకి తీసుకోక.. ఇటు బాబు పని అయిపోయిందనే అభిప్రాయం బలపడుతున్న వేళ ఆయన అప్రమత్తమయ్యారు. చూస్తూ కూర్చుకుంటే.. పార్టీలో పరిస్థితులు చేజారిపోయినా ఆశ్చర్యం లేదని భావించిన ఆయన.. మొత్తం సెట్ రైట్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిపై ‘ఘర్ వాపసీ’ ప్రయోగం చేశారనే వార్తలు వచ్చాయి. అది పెద్దగా వర్కవుట్ అయినట్టు లేదు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందువల్ల.. చాలా మంది వేచిచూసే ధోరణిలోనే ఉండి ఉండొచ్చు.
ఈ నేపథ్యంలో.. తాజాగా మరో ప్లాన్ వేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన వారిలో వేళ్లమీద లెక్కబెట్ట గలిగినంత మంది మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన వారంతా సైలెంట్ అయిపోయారు. మరికొందరు సైడైపోయారు. ఇలాంటి వారిని నమ్ముకొని వచ్చే ఎన్నికలకు వెళ్తే.. మరోసారి పరాభవం తప్పదని బాబు గ్రహించాడని టాక్.
అందుకే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ వృద్ధ నేతలకు పిలుపు ఇస్తున్నారట! రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పట్లో బాగుపడేట్టు కనిపించట్లేదు. దీంతో.. ఆ పార్టీలోని పేరున్న నేతలు కూడా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. అలాంటి వారిలో బలమున్న సీనియర్ నేతలకు టీడీపీ కండువా కప్పేందుకు చూస్తున్నారట. ఇక, వైసీపీలో ఉండి, సరైన ప్రాధాన్యం లేదని భావిస్తున్న సీనియర్లకు సైతం టచ్ లోకి వెళ్తున్నారట. ఇలా దాదాపు 40 నుంచి 50 మంది నేతలను లిస్ట్ ఔట్ చేసి, రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం.
మొత్తంగా.. వృద్ధనేతలతోనే వచ్చే ఎన్నికల యుద్ధంలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి, ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుంది? ఎంత మంది బాబును నమ్ముతారు? అన్నది చూడాలి.