కరోనా సెకండ్ వేవ్ తో భారత్ అల్లాడిపోతోంది. నిత్యం 4 లక్షల కేసులు.. 3 వేల మరణాలు నమోదవుతున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితులతో దేశం వణికిపోతున్న వేళ.. థర్డ్ వేవ్ ముప్పుకూడా ఉందంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో.. జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏం చేయాలో.. ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా సెకండ్ వేవ్ ప్రభావం భారత్ లో ఉంది. నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలు.. ఇంతటి మారణహోమానికి కారణమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మహమ్మారి ఉగ్రరూపం పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితి మే నెలాఖరు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దేశంలో మరణాల సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటిపోయింది. ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సీజన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దాదాపు సగం దేశం లాక్ డౌన్లోనే ఉంది. అయితే.. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు వేలాదిగా నమోదవుతుండగా.. పది రాష్ట్రాల్లో మాత్రం మరింత దారుణంగా వైరస్ విజృంభిస్తోంది.
యూపీ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, రాజస్థాన్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. యూపీలో పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా ఇంకా వీకెండ్ లాక్ డౌన్ మాత్రమే అమల్లో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కొన్ని లాక్ డౌన్ పెట్టగా.. మరికొన్ని నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.
ఇంత చేస్తున్నా.. కరోనా అదుపులోకి రావట్లేదు. సెకండ్ వేవ్ తొలిరోజుల్లో ప్రభుత్వాలతోపాటు జనం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు.. దేశం మొత్తం పాకిపోయిన తర్వాత ఆరాటపడుతున్నారని, అందుకే.. ఎన్ని చర్యలు తీసుకున్నా అదుపులోకి రావట్లేదని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలు వస్తుండడంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో.. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆక్సీజన్ ఉత్పత్తి పెంచుకోవాలని, ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. ఇక, జనం కూడా థర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. అయితే.. సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికే.. నానా అవస్థలు పడుతున్న వేళ మూడో వేవ్ ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.