Budda Venkanna arrest: టీడీపీ నేతల నోటిదరుసుకు అరెస్ట్ లతో తాళం వేస్తోంది అధికార వైసీపీ. ఇప్పటికే సీఎం జగన్ ను అప్పట్లో తిట్టిన పట్టాభిని ఊచలు లెక్కపెట్టేలా చేసిన సీఎం జగన్ సర్కార్ తాజాగా మరో టీడీపీ నేతను అరెస్ట్ చేసింది. తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ నేతలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే ప్రజలు కొడాలి నానిని చంపుతారని.. చంద్రబాబు ఇంటి గేటును తాకినా కూడా నాని శవాన్ని పంపుతామని టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్యాసినో సందర్భంగా సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని ఆయన చెప్పారు. ఇందులో డీజీపీ వాటా ఎంత అని బుద్దా వెంకన్న విమర్శించారు. డీజీపీకి వాటా ఉన్నందునే మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా.. తాను చావడానికైనా సిద్ధమని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పోలీసులు బుద్దా వెంకన్న ఇంటికి చేరుకొని మూడు గంటల పాటు విచారించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా మోహరించడంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుద్దా వెంకన్నను పోలీసులు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుద్దా వెంకన్న ను అరెస్ట్ చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అన్నింటికి తాను తెగించే ఉన్నానని బుద్దా వెంకన్న సై అన్నారు. చంద్రబాబును కొడాలి నాని తీవ్ర పదజాలంతో తిడితే ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. దీంతో ఏపీలో మరోసారి టీడీపీ , వైసీపీ మధ్య వార్ మొదలైంది. బుద్దా వెంకన్న అరెస్ట్ తో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు? ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు అనేది ఉత్కంఠ రేపుతోంది.