Chandrababu: ‘ఆయన మంచివారే. ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్లే మేము పార్టీని వీడుతున్నాం. మా బాధలు, వాస్తవ పరిస్థితిని చెప్పేందుకు కూడా వీలులేకుండా కోటరీ అడ్డుకుంటోంది’.. తెలుగుదేశం పార్టీని వీడే నాయకులు తరచూ చెప్పే మాటలివే. చంద్రబాబుకు పార్టీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ వినిపించే వ్యాఖ్యలివే. కానీ చంద్రబాబులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. అపర చాణుక్యుడిగా ఉన్న ఆయన పార్టీకి చేటు తెచ్చే కోటరీని మాత్రం అధిగమించలేకపోతున్నారు. పంజరంలో రామచిలుకలా ఆ నలుగురు అయిదుగురు దాటి బయట పడలేకపోతున్నారన్న అపవాదు అయితే ఉంది.కీలక నాయకులకు సైతం కోటరీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పవర్ లో ఉన్నప్పుడు సైతం కోటరీయే విపరీతమైన ప్రభావం చూపింది. చాలా సందర్భాల్లో కొందరు నాయకులు సైతం నొచ్చుకున్నారు. అసలు చంద్రబాబుకు కలిసే అవకాశమివ్వరని.. ఆయనకు వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించే వారు. మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. కానీ చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఉండడంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. గడిచిన ఎన్నికల్లో కోటరీ వల్ల పార్టీ దారుణంగా దెబ్బతిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తతుం పవర్ లో లేరు. ఈ సమయంలో ప్రోటోకాల్ సమస్య అంతగా ఉండదు. అయినా అధినేతను కలవాలంటే సవాలక్ష నిబంధనలు తెరపైకి తెచ్చి కోటరీ అడ్డుకుంటుందని ఇప్పటికీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటువంటి సమయంలో…
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. రాజధాని లేదు. పోలవరంలో పురోగతి లేదు. అభివ్రుద్ధి కానరావడం లేదు. పన్నుల బాదుడు, చార్జీల మోత, అప్పుల ఊబి.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ వైఫల్యాలే. దీంతో అన్నివర్గాల ప్రజలు జగన్ సర్కారును ద్వేషించడం మొదలు పెట్టారు. చంద్రబాబే నయమన్న నిర్ణయానికి వచ్చారు. అసలు చంద్రబాబు అంటేనే ఒంటి కాలి మీద లేచే వర్గాలు సైతం ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆయన్నే కోరుకుంటున్నాయి.
ఆయనైతే దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టగలరని నమ్ముతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించుకుంటూ వస్తే సులభంగా అధికారం చేజిక్కించుకోవచ్చనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచనగా ఉంది. అయితే పార్టీకి ఉన్న సమస్యలు ఏమిటనేది తెలుసుకోవాలంటే చంద్రబాబు తన కోటరీ దాటి రావాలని కోరుతున్నారు. 175 నియోజకవర్గాల్లో బలమైన నియోజకవర్గాలు ఏవీ? పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది? అక్కడ ఎలా బలోపేతం చేయాలి? నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై ద్రుష్టిపెట్టాల్సిన అవసరముంది. అంతకుముందే దిగువస్థాయి కేడర్ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ అడ్డుకుంటుంది. ఎవరైనా నాయకుడికి మనసొప్పక వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేందుకు అధినేతను కలవాలంటే కోటరీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు.
కొత్తగా మరో టీమ్..
చంద్రబాబు కోటరీలో గతంలో కొందరు బలమైన వ్యక్తులుండే వారు. వారు ఎంత చెబితే చంద్రబాబుకు అంతలా ఉండేది. ఇదే అలుసుగా తీసుకొని వారు కీలక పదవులు సైతం పొందారు. అధికారం కోల్పోగానే వారు ఇతర పార్టీలో జంప్ చేశారు. అయినా చంద్రబాబులో మార్పు రాలేదు. తాజాగా మళ్లీ మరో కోటరీ తయారైందని పార్టీ కేంద్ర కార్యాలయవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు స్వతహాగా మొహమాటస్తుడని, ఆయన మొహమాటాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర కార్యాలయంలో ఆయనకు దగ్గరై ఎవరైనా బాబు దగ్గరకు వెళ్లాలంటే తమను దాటి వెళ్లాలి అనేలా తమను తాము రూపొందించుకున్నారని, వారంతా వాస్తవ పరిస్థితులను బాబుకు తెలియజేయడంలేదని, గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కూడా ఇదే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా చంద్రబాబునాయుడు తన కోటరీని ఛేదించి పంజరం నుంచి బయట పడిన రామచిలుకలా స్వేచ్ఛగా ఉంటూ పార్టీకి ఇబ్బంది కలిగించే నాయకులను దూరం పెడుతూ, కోవర్టులుగా ఉన్నవారిని పార్టీనుంచి బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.
Also Read:Major- Vikram Movie: మూవీ లవర్స్ కి బెస్ట్ వీకెండ్… థియేటర్స్ లో రెండు అద్భుత చిత్రాలు!
Recommended Videos