TDP: తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బిజెపి, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు టిడిపి సోషల్ మీడియా, ప్రోటీడిపి జర్నలిస్టులు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి జనసేన తో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో ఆ పార్టీకి నష్టం జరిగిందన్నది ఈ ప్రచార సారాంశం. అయితే బిజెపి నుంచి జనసేన ను దూరం చేయడం ధ్యేయంగా ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో తెలుగుదేశం పార్టీతో జనసేన కుదుర్చుకుంది. బిజెపి విషయం తెలియడం లేదు. ఇంతలో తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పూర్తి పెట్టుకుంది. టిడిపి మాత్రం వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. కానీ టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ విషయంలో ఏం జరగబోతోంది అన్నది చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయం. బిజెపి కలిసి రావాలనేది పవన్ ఆలోచన. మొన్నటి వరకు ఇదే ఆలోచనతో ఉన్న టిడిపి మనసు మార్చుకున్నట్టుంది. కేవలం జనసేన వరకే పొత్తు ఉంటే బాగుంటుందని.. బిజెపి మద్దతు తెలిపితే చాలు అన్న రీతిలో మెజారిటీ టిడిపి క్యాడర్ కోరుకుంటుంది.
అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తానని చాలా సందర్భాల్లో పవన్ తేల్చి చెప్పారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది బిజెపియే. అయితే ఇప్పుడు బిజెపి వచ్చినా ఏపీలో పెద్ద ప్రయోజనం ఉండదని ప్రో టిడిపి జర్నలిస్టులు భావిస్తున్నారు. అందుకే తెర వెనుక కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో బిజెపి దెబ్బతిన్నట్లు.. ఆ పార్టీ నాయకత్వం బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో మరో పది స్థానాల్లో గెలుపు అవకాశం ఉన్నా.. జనసేనతో నష్టం జరిగిందన్నది ఆ ప్రచార సారాంశం. అయితే అటువంటి అభిప్రాయం కానీ, ప్రకటన కానీ తాము చేయలేదని బిజెపి నాయకత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం వెనుక టిడిపి ఉందని.. టిడిపి సోషల్ మీడియా విభాగం ఈ పని చేస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. బిజెపి, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.