
Chandrababu- Jagan: వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ అలెర్ట్ అయ్యిందా? తొలుత సంబరపడినా.. తరువాత జాగ్రత్తపడిందా? కోటంరెడ్డి, ఆనం విషయంలో స్పీడు తగ్గించడానికి అదే కారణమా? వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలను నెత్తిన ఎక్కించుకుంటే.. టీడీపీలో నేతలను కోల్పోయే అవకాశముందా? అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పాటిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్నపరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న జగన్ ధిక్కార స్వరాలపై దృష్టిపెట్టారు. ఒక్క ఆనం, కోటంరెడ్డే కాదు.. అటువంటి వారు ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుర్తించారు. వారికి ఎన్నికలు సమీపించేసరికి పక్కకుతప్పిస్తారన్న టాక్ ఉంది.
అయితే అధికార వైసీపీలో విభేదాలు చూసి టీడీపీ సంబరపడింది. అక్కడ వారికి చుక్కెదురు అయితే ఇక్కడికే వస్తారన్నధీమా కనిపించింది. కానీ వారు వచ్చేలోపే అభద్రతా భావంతో టీడీపీ నుంచి నేతలు దూరమవుతున్నారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి జయమంగళం వెంకటరమణ, మంగళగిరి నాయకులు నేరుగా సీఎం జగన్ ను కలిశారు. దీంతో చంద్రబాబు, అండ్ కోకు తత్వం బోధపడింది. తాము ఒక వ్యూహంతో అడుగు వేస్తే ప్రత్యర్థులు కూడా అంతే వ్యూహంతో అడుగులు వేస్తారని భావించి వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు విషయంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చూపిన సానుభూతి కోటంరెడ్డి ఎపిసోడ్ లో చూపించలేదు. కోటంరెడ్డికి అన్యాయం జరుగుతోందని ఆరోపించడం లేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి విడిచిపెట్టేశారు. అంతకంటే ముందుకు వెళితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నాయకులు, తటస్థ నేతలను వైసీపీ తన వైపు లాక్కునే అవకాశం ఉంది. అందుకే జగన్ కూడా వ్యూహాత్మకంగా ముందుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ధిక్కారస్వరాలపైనే దృష్టిపెట్టారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకున్న తరువాతే అసంతృప్త ఎమ్మెల్యేలు బయటపడేలా చూసుకున్నారు. మిగతా సామాజికవర్గాల ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీకి, అటు ధిక్కార ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమీపంలో వారిని అచేతనం చేసి ..వారి స్థానంలో కొత్తవారిని దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది తెలిసే చంద్రబాబు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల సమయానికి వైసీపీకి దూరమయ్యే వారు వస్తారని.. అలాగని ముందుగానే వారి గురించి మాట్లాడితే పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ఎన్నికల దాకా మౌనాన్ని ఆశ్రయిస్తేనే ఫలితందక్కుతుందన్న భావనతో చంద్రబాబు ఉన్నారు.