
KCR Strategies: జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యూహాలు క్యాడర్‌కు అర్థం కావడం లేదు. దేశ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తున్నారన్న సంకేతాలు క్యాడర్‌కు వెళ్తున్నాయి. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఇటీవలి కాలంలో కేసీఆరే ఏ రాజకీయ వ్యూహమూ పక్కాగా చేపట్టడం లేదు. ఎప్పుటికప్పుడు వాయిదాలు వేసుకుంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్ క్రేజ్ వేగంగా పడిపోతోంది. బాస్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా అన్న అభిప్రాయం క్యాడర్‌లో ఏర్పడుతోంది.
ఔట్‌డేటెడ్ నేతలు..
జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కేసీఆర్.. పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. కానీ బీఆర్‌ఎస్‌లో చేరేందుకు చరిష్మా ఉన్న నేతలెవరూ ఆసక్తి చూపడంలేదు. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్‌ను నమ్మడం లేదు. దీంతో ఔట్‌డేటెడ్ నేతలను గులాబీ బాస్ నమ్ముకుంటున్నారు. గొర్రె తోక పట్టుకుని గోదారి ఈదినట్లు ఔట్‌డేటెడ్ నేతలతో పార్టీ క్యాడర్‌లో టెన్షన్ నెలకొంటోంది. ఇక కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు కూడా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సచివాలయం ప్రారంభానికి తేదీ ఖరారు చేసినప్పుడే కచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని తెలుసు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వస్తుందని కూడా తెలుసు. అయినా ముహుర్తం ఖరారు చేశారు. నిజానికి ఇదేమీ పెద్ద అడ్డంకి కాలేదు. ఒక్క లెటర్ రాస్తే ఈసీ కూడా అనుమతి ఇస్తుంది. కానీ వాయిదాకే మొగ్గు చూపారు .. అనుమతి తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో అదేరోజు నిర్వహించాల్సినæ బహిరంగ సభ కూడా వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్ వరకూ ఉండదన్న సంకేతాలను కూడా బీఆర్‌ఎస్ చీఫ్ ఇచ్చారు.
ఓపిక నశిస్తోందా..
కేసీఆర్ వయసు రీత్యా పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో చంద్రబాబు తరహాలోనే తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలు కూడా విఫలమవుతున్నాయన్న అభిప్రాయం క్యాడర్‌లో ఏర్పడుతోంది. ఈ వయసులో కొత్తపార్టీ పెట్టి దానిని విస్తరించడంలో గులాబీ బాస్ వేస్తున్న ఎత్తుగడలేవి ఫలించడంలేదు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కేసీఆర్ కేసీఆర్ రిలాక్స్ అయిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మీ జోలికి మేం రాం.. ..మా జోలికి మీరు రావొద్దని అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ వైపు నుంచి ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయేమోనని అందుకే కేసీఆర్ జోరు తగ్గించారన్న వాదన వినిపిస్తోంది.

కారణం ఏదైనా కేసీఆర్ మాత్రం ఊహించినంతగా దూకుడుగా వెళ్లడం లేదు. ఇది బీఆర్‌ఎస్ నేతల్నీ గందరగోళానికి గురి చేస్తోంది. తెలంగాణలో మాత్రమే హడావుడి చేస్తే ఏం ప్రయోజనం అని పార్టీలో చేరిన ఇతర రాష్ట్రాల నేతలూ ఫీలవుతున్నారు.