Vishal- YS Jagan: తెలుగుదేశం పార్టీకి ఒక విషయం కలవరపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించడం ఈ కలవరపాటుకు కారణం. అయితే ఏపీలో అధికార పార్టీ దూకుడు గురించి చెప్పనక్లర్లేదు. పైగా కుప్పం బాధ్యతలను జగన్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించడంతో ఎంత సీరియస్ గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. అటు స్థానిక ఎన్నికల్లో పట్టుబట్టి మరీ పంతాన్ని నెగ్గించుకుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంతా ఈజీ కాదని హెచ్చరికలు పంపింది. అయితే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హీరో విశాల్ ను బరిలో దించుతారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే తాను పోటీ చేయడం లేదని.. తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని విశాల్ చాలా సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. అయితే రాజకీయాల్లో ఎదైనా సాధ్యమేన్న టాక్ నేపథ్యంలో విశాల్ షడెన్ గా ‘సీఎం జగన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చంద్రబాబుపై విశాల్ పోటీచేస్తారని చాలా ఏళ్ల నుంచి ప్రచారం ఉంది. విశాల్ తండ్రి వ్యాపారవేత్త. కుప్పం నియోజకవర్గంలో చాలా ఏళ్ల పాటు వ్యాపారం చేశారు. విశాల్ కు కుప్పం నియోజకవర్గ స్థితిగతులు తెలుసు. ప్రస్తుతం తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అక్కడ నడిగర్ సంఘంలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. గత ఎన్నికల తరువాత వైసీపీ కుప్పంపై ప్రత్యకంగా ఫోకస్ పెంచింది. ఇక్కడ చంద్రబాబును ఓడిస్తే రాజకీయంగా చెక్ చెప్పవచ్చని భావిస్తోంది. బలమైన నేతను బరిలో దింపాలని ప్రయత్నిస్తోంది. అయితే నడిగర్ సంఘంలో కీరోల్ ప్లే చేసిన విశాల్ అయితే గట్టి పోటీ ఇవ్వొచ్చని డిసైడ్ కు వచ్చింది. కానీ తనకు అటువంటి ఉద్దేశం లేదని విశాల్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో కుప్పం నియోజకవర్గంతో తన కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయంటూ వైసీపీకి ఆప్షన్ ఉంచేలా మాట్లాడారు.

ఇప్పుడు ఏకంగా జగన్ నుంచి పిలుపురావడంతో కలవనున్నారు. ఇప్పుడు ఈ భేటీ తెలుగు రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. విశాల్ కు జగన్ ఏం చెబుతారు? విశాల్ ఒకే చెబుతారా? లేకుంటే తనకు ఉద్దేశ్యం లేదని చెబతారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే కుప్పం వైసీపీ ఇన్ చార్జిగా భరత్ ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా కూడా చేసిన జగన్ కుప్పం అభివృద్ధికి ప్రత్యకంగా నిధులు కూడా కేటాయించారు. పనులకు స్వయంగా వెళ్లి శంకుస్థాపనలు చేశారు. భరత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయన్ను గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విశాల్ సీఎం జగన్ ను కలవనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా టీడీపీలో టెన్షన్ నెలకొంది.