Jana Sena Chief Pawan Kalyan: సాధారణంగా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా మాట్లాడతారు. ప్రజలకు, తనను అభిమానించే వారికి నచ్చే విధంగా ప్రసంగిస్తారు. వారికి రుచించే వ్యాఖ్యానాలే చేస్తుంటారు. రాజకీయాల్లో అదోరకమైన స్ట్రాటజీ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు నొప్పించకుండా.. ఒప్పించే రీతిలో మాట్లాడే నాయకులే సక్సెస్ అయిన సందర్భాలున్నాయి. పవన్ విషయానికి వచ్చేసరికి తన ప్రసంగం ఎప్పడూ సీరియస్ గా నే ఉంటుంది. అవేశపూరిత ప్రసంగాలే ఎక్కువగా చేస్తారు. పరిస్థితులను చూసి చలించిపోయి మాట్లాడతారు. స్లో మోషన్ లో ప్రారంభమయ్యే ఆయన స్పీచ్.. క్రమేపీ వేగం పెంచుకుంటుంది. ఆవేశపూరితం వైపు పయనిస్తుంది. అయితే ఆయనలో ఉన్న ఆ ఎమోషనే కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ ప్రసంగాలకే యువత, విద్యార్థులు ముగ్థులయ్యేది. అయితే ఆయన ఇంతలా ఎందుకు ఆవేశం ప్రదర్శిస్తుంటారు? సామాజిక రుగ్మతలపై స్పాంటేనీస్ గా ఎందుకు స్పందిస్తారు? అన్నది మాత్రం ఆరాతీస్తే పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి.

పవన్ ఎప్పుడూ భిన్నంగానే ఆలోచిస్తారు. విపరీతమైన స్టార్ డమ్ ఉండి.. బోక్సాఫీస్ వద్ద కోట్లాది రూపాయలు కొల్లగొట్టే స్టామినా ఉండి… మంచి సినిమా లైఫ్ ను వదులుకొని ప్రజల మధ్యకు రావడంతోనే ఆయన ఆలోచన విభిన్నమైనదని తెలుస్తోంది. వ్యవస్థను పూర్తిగా మార్చాలన్న నిజాయితీ, న్యాయం, ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలని, ప్రజలందరికీ సేవచేయాలన్న భావన ఆయనలో ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని భిన్నంగా ఆలోచిస్తుంటారు. తన ఆలోచనలనే భావవ్యక్తీకరణ ద్వారా పంచుకుంటారు. నిజాయితీ ఉన్నవారు ధైర్యంగా మాట్లాడతారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని సహించలేరు. పవన్ కూడా ఈ కోవలోకే వస్తారు కనుక అతడి ఆడే మాటలు పౌరుషాన్ని తలపిస్తాయి. కాస్తా కఠువుగానే ఉంటాయి. అభిమానులకు ప్రేమను పంచుతాయి. ప్రత్యర్థులకు పురుష పదజాలంగా కనిపిస్తాయి.

పుస్తకాలకు, పవన్ కు విడదీయ రాని బంధం. మంచి పుస్తకం ఒక నేస్తంగా భావిస్తారు. ఎక్కువగా పుస్తక పఠనం చేస్తారు. దాని ద్వారానే ఆయన ప్రత్యేక భావజాలాన్ని రూపొందించుకున్నారు. పుస్తకాలు, వాటిని రాసిన ప్రసిద్ధ రచయితల ప్రభావం పవన్ పై విపరీతంగా ఉంటుంది. సినిమాల్లో మాదిరిగానే ఆయన నిజజీవితంలో కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు.ఏపీ భవిత అంధకారంలో ఉందని.. దానిని వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బలమైన నిర్ణయానికి వచ్చారు. అందుకే వైసీపీని గద్దెదించుతానని.. వైసీపీ విముక్త ఏపీకి కష్టపడతానని పౌరుషమైన పదజాలంతోనే హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థులకు మాత్రం ఆయనలో పౌరుషం కనిపిస్తోంది. కానీ అది తన మనసులో వచ్చే భావజాలమని అతడ్ని అభిమానించే వారు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. మిగతా వారికి మాత్రం అవి సినిమా డైలాగుల మాదిరిగానే వినిపిస్తున్నాయి.

అయితే పవన్ తాను కోరుకున్న సమాజం కానీ.. ప్రజలు కానీ దొరకడం లేదు. తాను వ్యవస్థను మార్చాలనుకున్న క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు, ప్రత్యర్థుల ఆగడాలు ఎదురవుతున్నాయి. ఆ క్షణంలో తన భావాన్ని వ్యక్తపరిచే క్రమంలో ఆయన ఆవేశం బయటపడుతోంది. ఆ ఆవేశమే ఆయనకు ఉన్నతశిఖరాలకు చేర్చుతోందని ఆయన సోదరుడు చిరంజీవి సైతం చెప్పుకొచ్చారు. ఆ ఆవేశం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందోనని భయపడినా.. వాటన్నింటినీ అధిగమించి పవన్ మంచి స్థితిలోకి వచ్చాడని మెగస్టార్ తమ్ముడు పవన్ పై ఉన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు కూడా. అయితే ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలం. పవన్ పౌరుషం, పవన్ భావ వ్యక్తీకరణ, పవన్ వ్యక్తిత్వం..అవన్నీ ప్రజల శ్రేయస్సు. వారికి మంచిచేయాలన్న పరితపించడంలో భాగమే. అది ఇప్పుడిప్పుడే ఏపీ సమాజం గ్రహిస్తోంది.