రెండు కళ్ల సిద్ధాంతంతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో ఏపీలోనూ అధికారం కోల్పోయిన ఆ పార్టీ.. అక్కడా రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన టీడీపీ.. అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరులో దూకుడు ప్రదర్శిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అనుకున్న విధంగా వ్యూహాలు ప్రదర్శించలేక పోతోందనే టాక్ వినిపిస్తోంది. కొందరు నాయకులు అనుసరిస్తున్న వ్యవహారంతో పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది
బాపట్ల, మాచర్ల, మంగళగిరి, నరసారావుపేట లాంటి నియోజకవర్గాల్లో రెండు దశాబ్దాలుగా పార్టీ జెండా ఎగరడం లేదు. ఇక గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి రెండు దశాబ్దాలుగా దీనస్థితిలో ఉంది. ఇక్కడ టీడీపీ జెండా మోసే నాయకులు కనిపించడం లేదు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కూడా ఈ నియోజకవర్గానికి కూత వేటు దూరంలోనే ఉంటుంది. ఆ కార్యాలయానికి నిత్యం పార్టీ పెద్దలు వస్తూ పోతుంటారు. అయినా.. తూర్పు నియోజకవర్గంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. గతంలో పార్టీకి సేవ చేసి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాల్ జాన్ బాషా వారసులు ఇక్కడ నుంచి జెండా ఎగరేయాలని గత ఎన్నికల సమయంలోనే కోరారు.
అయితే.. అప్పట్లో కారణాలు ఏవైనా వారికి అవకాశం ఇవ్వలేదు. ఇక, ఇక్కడి పరిస్థితి చూస్తే.. 1999 నుంచి పార్టీ గెలిచింది లేదు. వరుసగా నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయింది. 2009లో లాల్ జాన్ భాషా సోదరుడు జియావుద్దీన్ భయంకరంగా ఓడిపోవడంతో పాటు మూడో స్థానంలో నిలవడంతో చంద్రబాబు ఆ కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. 2009లో మస్తాన్ వలీ కాంగ్రెస్ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ హవా తగ్గి కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి అనుకూలంగా మారిపోయింది.
Also Read: ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం
దీంతో 2014, 2019 ఎన్నికల్లో ముస్తాఫా వైసీపీ టికెట్‌పై విజయం సాధించారు. ఇటీవల కాలంలో ముస్తాఫాపై వ్యతిరేకత వస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. ఆయన ఇక్కడి కనీసం అవసరాలు తీర్చడం లేదని ముస్లిం సామాజిక వర్గమే ఆరోపిస్తోంది. తూర్పులో ముఖ్యంగా నీటి సమస్య వేధిస్తోంది. దీనిని తీర్చాలని ఎన్నికల సమయంలో నేతలకు ఇక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఇక ట్రాఫిక్ , డ్రైనేజ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. అయితే.. ఏ ఒక్కరూ కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ముస్తాఫాపై వ్యతిరేకత పెరుగుతోంది. లాల్‌జాన్ బాషా వారసులను కూడా ప్రోత్సహించకపోవడంతో ఈ నియోజకవర్గాన్ని టీడీపీ వదిలేసుకుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్