TDP : ఎన్నికల్లో నెగ్గడానికి ప్రజాబలం ఉండాలి. ప్రజల మధ్యన ఉంటూ వారి మద్దతును, ఆమోదాన్ని పొందాలి. అయితే ప్రజా బలంతో పాటు దైవం కూడా అనుగ్రహించాలని జగన్ భావిస్తున్నారు. తనను రెండోసారి సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని చెబుతూ వస్తున్న ఆయన ఇప్పుడు యాగాలపై దృష్టిపెట్టారు. గత ఎన్నికలకు ముందు చేసిన యాగాల ఫలితాలతోనే అంతులేని మెజార్టీతో అధికారంలోకి రాగలిగానని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. విజయవాడ వేదికగా రాజశ్యామల యాగం చేయిస్తున్నారు. ప్రస్తుతం దేవదాయ శాఖ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 17 వరకూ..ఆరు రోజుల పాటు యాగం జరగనుంది.
కేసీఆర్ ఇదే మాదిరిగా..
తెలంగాణ సీఎం కేసీఆర్ కు దైవభక్తి ఎక్కువ. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తనకు కష్టాలు ఎదురైన ప్రతీసారి ఆయన యాగాలు చేయిస్తూ వచ్చారు. అంతెందుకు రాజశ్యామల యాగానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించింది కూడా కేసీఆరే. రెండోసారి అధికారంలోకి రావాలని కోరుతూ 2018లోనే ఆయన యాగం చేశారు. అప్పటి నుంచి రాజశ్యామల యాగం అలా రాజకీయాల్లో నానుతోంది. ఇపుడు ఏపీలో రెండవసారి జగన్ సీఎం కావాలని వైసీపీ నేతలు రాజశ్యామల యాగం చేయిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో కావడం వివాదం ముదురుతోంది.
లోక కళ్యాణం కోసమే..
అయితే ఏపీ ప్రజల కోసమే యాగం చేస్తున్నట్టు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంతటి మహత్ కార్యక్రమానికి దిగినట్టు చెప్పుకొచ్చారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాయని.. ఈ ఏడాది కూడా పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ యాగం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇపుడు అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. జగన్ కోసమే ఈ యాగం అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతలా చేయాలని ఉంటే తన సొంత డబ్బుతో యాగం చేయించుకోవాలి… కానీ దేవాదాయ శాఖ సొమ్ముతో ఏంటని ప్రశ్నిస్తున్నారు పైగా టీటీడీ నుంచి రెండున్నర కోట్లు ఈ యాగానికి మళ్ళించారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపిస్తున్నారు. అలాగే ప్రసిద్ధి చెందిన దేవాలయాల సొమ్ముతో ఈ యాగం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు.
తెరపైకి మత వాదం..
ఈ యాగం పుణ్యమా అని సీఎం జగన్ పై టీడీపీ నేతలు కొత్తవాదాన్ని తెరపైకి తెచ్చారు. హిందూ మతాన్ని నమ్మే వారే ఈ యాగం చేయాలని చెబుతున్నారు అయితే టీడీపీ నేతల వాదనపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.దేవాలయం అన్న తరువాత చేసేవే యాగాలు హోమాలు పూజాలు. మరి వాటిని వద్దు అనే హక్కు ఎవరికీ లేదు. ఇక రాజశ్యామల యాగం చేస్తే జగన్ రెండవసారి సీఎం అయిపోతారు అన్న భయాలు ఏమైనా టీడీపీ నేతల కు ఉన్నాయా అన్నదే పెద్ద డౌట్. భక్తి వేరు. జనాలు ఇచ్చే తీర్పు వేరు అన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలి. అలా అయితే గుండె నిండా దైవభావం పెట్టుకొని రాజకీయ రంగంలో అదృష్టాన్ని పరీక్షించే సమయంలో కొంతమంది ఫెయిలయ్యారు కూడా.