ఇఎస్ఐ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ రోజు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న వార్డులో ఒక గదిలో ఆయనను ఉంచారు. ఆసుపత్రి వైద్యుల బృందం ఆయనను పరీక్షించారు. పరీక్షల అనంతరం ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
ఆయనకు ఈ నెల 11వ తేదీ తేలికపాటి శస్త్ర చికిత్స జరిగిందని, మరుసటి రోజే శ్రీకాకుళం నుంచి విజయవాడ ప్రయాణం చేయడం వల్ల చిన్న గాయం అయ్యిందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగిందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని అన్నారు. 90 శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు.
అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదని, నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు సమయం పడుతుంది. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చని అన్నారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని అందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జైళ్ల శాఖ ఐజికి అనుమతి కొరకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను పరిశీలించిన జైళ్ల శాఖ ఐజి అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనలు కారణంగా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. రెండు నెలలుగా ఖైదీలను కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.