Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి.. చంద్రబాబు స్కెచ్

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి.. చంద్రబాబు స్కెచ్

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని ప్రకటించనుందా? వైసీపీలో పరిణామాలను క్యాష్ చేసుకొనుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రిపీట్ చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి మూడు స్థానాలు, ఏపీ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీకి సంబంధించి ఖాళీ అయిన స్థానాలు మూడు వైసీపీకి దక్కే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. 23 స్థానాలతో టిడిపి సరిపెట్టుకుంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కో స్థానానికి 43 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన మూడు స్థానాలు వైసీపీకి దక్కాలి. కానీ ఇక్కడే చంద్రబాబు పావులు కదపనున్నారు. ఒక్క స్థానానికి సంబంధించి టిడిపి అభ్యర్థిని బరిలో దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత మార్చిలో ఎమ్మెల్యేల కోట కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు.ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను.. చివరి ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థిని పోటీలో పెట్టారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం టిడిపికి దక్కింది. ఇప్పుడు కూడా రాజ్యసభ ఎన్నికల్లో అదే ఫార్ములాను అనుసరించి.. వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను జగన్ మార్చుతున్నారు. 60 చోట్ల మార్పులు చేశారు. సహజంగానే అది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మింగుడు పడని విషయం. జగన్ పై లోలోపల చాలామంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు.వారందరి సహకారంతో రాజ్యసభ ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు. మరో నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి వైపు వచ్చారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రెండు పార్టీల నేతలు స్పీకర్ ను కోరాయి. ఇటువంటి తరుణంలో రాజ్యసభకు బలమైన అభ్యర్థిని బరిలోదించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టిడిపికి ఉన్న ఎమ్మెల్యేలకు తోడు.. మరో 20 మందిని లోబరుచుకుంటే రాజ్యసభ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే సార్వత్రిక ఎన్నికల ముందు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది.అందుకే చంద్రబాబు బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

రాజ్యసభలో ఎంపీ కనకమెడల రవీంద్ర పదవీ విరమణ తో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. అందుకే ఈసారి ఎలాగైనా ఒక అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా రాజ్యసభలో బలాన్ని పదులపరుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా తగ్గించుకున్న విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీకి చాలామంది సిట్టింగులు దూరమయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరోవైపు జనసేన వైపు మరికొందరు చూస్తున్నారు. కొలుసు పార్థసారథి, ఎలిజా వంటి వారు టిడిపి వైపు చూస్తున్నారు. ఈ లెక్కన పది నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మారారు. తమ రాజకీయ భవిష్యత్ పై నీళ్లు చల్లిన జగన్ పై వారంతా కోపంగా ఉన్నారు. అటువంటి వారిని చేరదీసి రాజ్యసభలో జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఆర్థికంగా బలమైన అభ్యర్థిని బరిలో దించడం ద్వారా అనుకున్నది సాధించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా ఉండాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version